ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంటిపై ఎసిబి అధికారులు శనివారం దాడి చేశారు. అతడి ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎఈకి సంబంధించిన భారీగా ఆస్తులను ఎసిబి అధికారులు గుర్తించారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం… నీటి పారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్న నిఖేష్ కుమార్ కుమ్పాపై కొంత కాలం నుంచి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నుంచి ఏక కాలంలో నిఖేష్ కుమార్ ఇళ్లు, అతడి బంధువులు, సన్నిహితుల ఇళ్లు 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా రూ.17,73,53,500 కోట్ల ఆస్తులు గుర్తించారు ఈ ఆస్తు మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ఎసిబి అధికారులు గుర్తించారు.
నిఖేష్ కుమార్ గండిపేట బఫర్ జోన్, ఎఫ్‌టిఎల్‌లో నిబంధనకు విరుద్ధంగా భవనాలు, అపార్ట్‌మెంట్లు కట్టుకునేందుకు అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ గుర్తించింది. ఇదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, రాజేంద్రనగర్ పరిధిలో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. నికేష్ పేరిట ఐదు ఇళ్లు, ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ప్లాట్లు, రెండు కమర్షియల్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఫామ్ హౌస్‌ల విలువ రూ.80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉండగా నిఖేష్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ నికేష్ ఏసీబీకి దొరికారు. ఓ వ్యక్తికి ఎన్‌ఓసి ఇచ్చేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేయడంతో ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో దాడి చేసి పట్టుకున్నారు.