గజ్వేల్‌లో కెసిఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్
ఉందనడం అబద్ధం ఏడాది పాలనలో అన్ని
వర్గాలనూ ఏడిపించడమే తప్ప చేసిందేమీ లేదు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బిఆర్‌ఎస్ నేత,
మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
గజ్వేల్‌లో కెసిఆర్‌కు వెయ్యి ఎకరాల
ఫామ్ హౌస్ ఉందనడం అబద్ధం
సిఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
మన తెలంగాణ/హైదరాబాద్: మహబూబ్ నగర్ రైతు పండుగలో రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎంత మొత్తుకున్నా దండుగే అయ్యిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు. ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరు మనిపించిందని పేర్కొన్నారు. ఏడాది పూర్తయిన సందర్భంగానైనా రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు ఈ యాసంగికి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలుపుకొని ఎకరాకు రూ.15 వేలు ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చెయ్యి చూపారని హరీశ్ రావు అన్నారు. ఇక కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతు బంధుకు అతీగతీ లేదని దుయ్యబట్టారు. రైతు పండుగ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేసారని తెలిపారు.
కెసిఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అంటూ గప్పా లు కొట్టుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. కాళేశ్వ రం ప్రాజెక్టు వల్ల కాదు, తమ కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే కోటి 53 లక్షల టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.
సిఎం చెప్పిన ప్రాజెక్టులు 2014లో కూడా ఉన్నాయని, మరి అప్పుడు 68 లక్షల టన్నుల వరి మాత్రమే ఎందుకు పండిందని ప్రశ్నించారు. 2023 24 నాటికి కోటి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఎలా సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని చెబుతున్నారని, పాలమూరు సభ సాక్షిగా ఏ రైతులను బెదిరిస్తున్నారు… పాలమూరు బిడ్డగా ఇది రేవంత్‌రెడ్డి న్యాయమా..? అని అడిగారు. ఒకసారి ఫార్మాసిటీ అని గెజిట్ ఇచ్చి, బిఆర్‌ఎస్ పోరాటంతో వెనక్కి తగ్గి ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అని ప్రచారం చేస్తున్నారని, ఎటు వాటమైతే అటు మాట్లాడటం రేవంత్‌రెడ్డికే చెల్లిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్దాలు మాట్లాడటానికి నోరెలా వచ్చిందని హరీష్‌రావు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కెసిఆర్‌కి గజ్వెల్‌లో వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు.. నిరూపించేందుకు సిద్దమా..? అని సిఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రమ్మని తెగ పిలుస్తున్నావు రేవంత్ రెడ్డి..తాము ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్ని వర్గాలను ఏడిపించడమే తప్ప ప్రజలకు చేసిందేం లేదని విమర్శించారు. అబద్దాలు చెబుతూ ఏడాది నడిపించావు.. ఈ అబద్దాలతో ఇంకా ఎంతో కాలం మోసం చేయలేవు అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో నీ ఏడాది పాలన అసలు రంగు బయట పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నామని… అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ము మీకుందా..? అని హరీష్‌రావు సిఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.