Sunday, January 5, 2025

మైనార్టీల భద్రత గాలిలో దీపం

- Advertisement -
- Advertisement -

మతపరమైన హింసకు బంగ్లాదేశ్ ఆలవాలంగా మారుతోంది. షేక్ హసీనా గత ఆగస్టులో ప్రధాని పదవిని వదిలి, ఇండియాలో తలదాచుకున్నప్పటినుంచీ బంగ్లాదేశ్ లోని మతఛాందసవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఒక అంచనా ప్రకారం గత ఐదు నెలల్లో హిందువులపై 200కి పైగా దాడులు జరిగాయి. తొమ్మిదిమంది చనిపోగా, వందల సంఖ్యలో హిందువులు గాయపడ్డారు. భారీయెత్తున హిందువుల ఆస్తులు విధ్వంసానికి గురయ్యాయి. బంగ్లాదేశ్ లో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? నోబెల్ శాంతి బహుమతి విజేత మహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా, ఈ దాడులు పెరిగాయే తప్ప తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా ఇస్కాన్ మాజీ అధికార ప్రతినిధి, బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ నేత అయిన చందన్ కుమార్ దాస్ అలియాస్ చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టుతో ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లాయి. పదిహేడు కోట్ల బంగ్లా జనాభాలో హిందువుల సంఖ్య కోటిన్నరకు మించదు. ఇతర మైనారిటీ వర్గాల సంఖ్య మరింత అల్పం. హిందువులలో అధికశాతం ఓటర్లు షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీకి మద్దతు ఇస్తారనే దుగ్ధతో, అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు హసీనా ప్రభుత్వంపై పెల్లుబుకిన ప్రజాగ్రహం, ఇప్పుడు హిందువులపైకి మళ్ళింది. వారిపై మతఛాందసవాదులు దాడులకు పాల్పడుతూ, ఆస్తులను విధ్వంసం చేస్తూ వికృతానందం పొందుతున్నారు. చిట్టగాంగ్ లో ఇటీవల జరిగిన ఓ భారీ బహిరంగ సభలో జాతీయ పతాకానికంటే ఎత్తులో కాషాయ జెండాను ఆవిష్కరించి, తమ దేశ పతాకాన్ని అగౌరవపరిచారంటూ వచ్చిన ఓ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని అక్కడి పోలీసులు కృష్ణదాస్ ను అరెస్టు చేసి, జైలుకు పంపారు. అంతటితో ఆగకుండా కృష్ణదాస్ తోపాటు మరో 18మంది బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.

చిట్టగాంగ్ లోని పుండరీక ధామ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణదాస్ హిందువుల రక్షణకోసం పోరాటం సాగించడంలో ముందు వరసలో ఉంటున్నారు. హిందువుల పరిరక్షణకోసం ఆయన ఎనిమిది డిమాండ్లు చేసి, వాటి సాధనకోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. హిందువులపై జరుగుతున్న దాడులపై విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, బాధితులకు పరిహారం చెల్లించడం, ధ్వంసమైన ఆస్తులకు పరిహారం చెల్లించడం వంటివి ఆయన డిమాండ్లలో ప్రధానమైనవి. ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో యూనుస్ మైనారిటీ వర్గాల ప్రతినిధులతో చర్చలు జరిపినా, జాగరణ మంచ్ డిమాండ్లపై మాత్రం పెదవి విప్పలేదు. మైనారిటీలపై దాడులు జరిగితే తాను పదవినుంచి వైదొలగుతానని మొదట్లో ప్రకటించిన యూనుస్ ఇప్పుడు స్వరం మార్చారు. తమ దేశంలో జరుగుతున్నవి మతపరమైన దాడులు కావంటూ దౌర్జన్యకారులకు వత్తాసు పలకడంతో విస్తుపోవడం ప్రజాస్వామికవాదుల వంతయింది. మరోవైపు కృష్ణదాస్ చేస్తున్న పోరాటం మత ఛాందసవాదులకు కంటగింపుగా మారింది.

ఆయన అరెస్టుతో శాంతించని దౌర్జన్యకారులు హిందూ దేవాలయాలపై మూకుమ్మడి దాడులు జరిపి విధ్వంసం సృష్టిస్తున్నారు. కృష్ణదాస్ అరెస్టు అనంతరం, తమ దేశంలో ఇస్కాన్ కార్యకలాపాలను నిషేధించాలంటూ దాఖలైన ఓ పిటిషన్ ను ఢాకా హైకోర్టు కొట్టివేయడం బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ కొన ఊపిరితోనైనా బతికి ఉందనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ కు చెందిన ఓ జాతీయ పత్రిక నిర్వహించిన తాజా సర్వేలో దేశంలోని 49 జిల్లాల్లో హిందువులపై దాడులు జరిగినట్లు వెల్లడి కావడం అక్కడ ప్రజాస్వామ్య పతనావస్థను కళ్లకు కడుతోంది.

అంతేకాదు, ఆ దేశంలో మతపరమైన హింస క్రమేపీ పెరుగుతోందని రెండేళ్ల క్రితమే ఆమ్నెస్టీ ఇంటర్నెషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. అయినా కనువిప్పు కలగని యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తాజాగా జరుగుతున్న దాడులపట్ల కూడా ఉదాసీన వైఖరి కనబరచడమే ఆశ్చర్యకరం. ఈ నేపథ్యంలో బంగ్లాను కట్టడి చేసేందుకు భారత్ రంగంలోకి దిగవలసిన ఆవశ్యకత కనబడుతోంది. మైనారిటీల భద్రతకు చర్యలు తీసుకోవాలంటూ భారత్ పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను బంగ్లాదేశ్ పెడచెవిన పెట్టడమే కాదు, పరిస్థితిని భారత్ తప్పుదోవ పట్టిస్తోందంటూ నిరసించడం యూనుస్ ప్రభుత్వం తెంపరితనానికి నిదర్శనం. విజ్ఞప్తులు, విన్నపాలతో యూనుస్ ప్రభుత్వం దారికి వస్తుందన్న ఆశలు సన్నగిల్లుతున్న నేపథ్యంలో భారత్ ఆంక్షల కొరడా విధించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News