Tuesday, January 7, 2025

ఇక దేశ ఆర్థిక అభివృద్ధి ఉండబోదు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయి 5.4 శాతానికి చేరుకుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. రైతులు, కార్మికులు, మధ్యతరగతి, పేదలు ఆర్థికంగా అవస్థలు ఎదుర్కొంటుంటే, ప్రయోజనాలు కొంతమంది బిలియనీర్లకే పరిమితమైతే భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించబోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

“ భారతదేశం స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ఠ స్థాయికి, అంటే 5.4%కి పడిపోయింది. విషయమేమిటంటే – భారత ఆర్థిక వ్యవస్థ కేవలం కొద్దిమంది బిలియనీర్లకు మాత్రమే ప్రయోజనాలు అందుతున్నంత కాలం … రైతులు, కార్మికులు, మధ్యతరగతి మరియు పేదలు వివిధ ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నంత కాలం భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించదు” అని కాంగ్రెస్ నాయకుడు ‘ఎక్స్’ లో (ఇదివరకటి ట్విట్టర్) పోస్ట్ చేశారు.

బంగాళదుంపలు, ఉల్లి ధరలు దాదాపు 50 శాతం పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి పెరిగిందని, రూపాయి విలువ 84.50కి పడిపోయిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

“ఈ వాస్తవాలను పరిశీలించండి, పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో గమనించండి: రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయి 6.21 శాతంకి పెరిగింది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది బంగాళదుంపలు, ఉల్లిపాయల ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. రూపాయి కనిష్ట స్థాయి 84.50కి చేరుకుంది. నిరుద్యోగం ఇప్పటికే 45 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది’ అని రాహుల్ అన్నారు.

గత ఐదేళ్లలో కూలీలు, ఉద్యోగులు, చిన్న వ్యాపారుల ఆదాయం స్తంభించిపోయింది లేదా గణనీయంగా తగ్గిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

‘‘మొత్తం అమ్మకాలలో అందుబాటు ధరల గృహాల వాటా గత ఏడాది 38 శాతం నుండి 22 శాతానికి పడిపోయింది. ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులకు ఇప్పటికే డిమాండ్ తగ్గుతోంది. గత 10 ఏళ్లలో కార్పొరేట్ పన్ను వాటా 7 శాతం తగ్గగా, ఆదాయపు పన్ను 11 శాతం పెరిగింది. నోట్ల రద్దు, జిఎస్టీ కారణంగా ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగ వాటా 50 ఏళ్లలో కనిష్ఠంగా 13 శాతానికి పడిపోయింది. ఇటువంటి పరిస్థితిలో, కొత్త ఉద్యోగ అవకాశాలు ఎలా సృష్టించబడతాయి? ’’అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News