Tuesday, January 7, 2025

మన దేశ స్ఫూర్తి కోసమే మా పోరాటం

- Advertisement -
- Advertisement -

ప్రజల హక్కుల దుర్బలం చేసి ‘వాణిజ్యవేత్త మిత్రుల’ పరం చేస్తున్నారు
బిజెపి, కేంద్రంపై ప్రియాంక గాంధీ విమర్శనాస్త్రాలు

వయనాడ్ : కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల హక్కులను దుర్బలం చేసి, కొద్ది మంది ‘వాణిజ్యవేత్తలైన మిత్రుల’ పరం చేస్తున్న శక్తిపై పోరాటం చేస్తున్నామని ఆమె తెలిపారు. వయనాడ్‌లోని మనంతవాడిలో ఒక సమావేశంలో ప్రియాంక ప్రసంగిస్తూ, ‘మన దేశ నిర్మాణానికి పునాదులైన వ్యవస్థలను నాశనం చేసేందుకు తన అధికారం కింద సర్వం చేస్తున్న ఒక శక్తిపై మేము పోరాటం సాగిస్తున్నాం’ అని చెప్పారు. ‘మన దేశం స్ఫూర్తి కోసం, భారత్ ఆత్మ కోసం మేము పోరాడుతున్నాం’ అని ఆమె చెప్పారు. ప్రజలకు నిజాయతీగా చెందవలసిన ఈ దేశ అధికారం, వనరుల కోసమే పోరు అని కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక పేర్కొన్నారు.

జూలై 30న పర్వత జిల్లా వయనాడ్‌ను దెబ్బ తీసిన భారీ మట్టిచరియ దుర్ఘటన గురించి ప్రియాంక గుర్తు చేస్తూ, తాను ఎన్నో దుర్ఘటనలు చూసినట్లు తెలియజేశారు. ‘దేశంలో దుర్ఘటనలు సంభవించిన ప్రదేశాలకు మా వృత్తి కారణంగా మేము వెళ్లి జనాన్ని కలుస్తుంటాం. అయితే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసిన బాధ గానీ, ఇక్కట్లు గానీ ఎన్నడూ చూడలేదు. ప్రకృతి విలయం ఒక చిన్న ప్రాంతంపై కేంద్రీకృతమైంది. ఆ ప్రాంతంలో ఇళ్లు అన్నీ కొల్టుకుపోయాయి. అన్ని కుటుంబాలూ కొట్టుకుపోయాయి. అందరి జీవనోపాధులూ నీళ్ల పాలయ్యాయి.

అయినా, ఈ బీభత్సం మధ్య, ఈ బాధ, ఇక్కట్ల మధ్య మీలో మానవత్వాన్ని నా కళ్లతో చూశాను. మీరు మతం అడగలేదు, కులం అడగలేదు, బాధితుల సహాయార్థం మీరు చేయగలిగింది అంతా చేశారు. అది సిసలైన విలువలకు ప్రతీక’ అని ప్రియాంక అన్నారు. లోక్‌సభకు ఎన్నికైన అనంతం మొదటిసారిగా ఈ పర్వత జిల్లాకు వచ్చిన ప్రియాంక తన మొదటి బాధ్యత మలయాళం నేర్చుకోవడమేనని చెప్పారు. మీరు ఇక్కడే ఉంటారా అన్న సభికుల ప్రశ్నలకు ప్రియాంక సమాధానం ఇస్తూ, ‘ఆ విషయం కచ్చితంగా చూస్తా’ అని చెప్పారు. ఇక్కడ ఉండేందుకు చక్కని ప్రదేశం కోసం చూస్తానని ప్రియాంక తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News