Monday, January 6, 2025

గంట సేపు నజ్మా హెప్తుల్లాను నిరీక్షణలో పెట్టిన సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

బెర్లిన్ నుంచి నజ్మా ఫోన్ కాల్‌కు సోనియా స్పందన తీరు
‘మేడమ్ బిజీ’ అని సిబ్బంది సమాధానం
ఆత్మకథలో నజ్మా హెప్తుల్లా వెల్లడి

న్యూఢిల్లీ : నజ్మా హెప్తుల్లా 1999లో అంతర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) అధ్యక్షురాలిగా ఎన్నికైన అనంతరం ఆ వార్త తెలియజేయడానికి బెర్లిన్ నుంచి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫోన్ చేశారు, కానీ ‘మేడమ్ బిజీగా ఉన్నారు’ అని ఒక ఉద్యోగి చెప్పిన మీదట ఆమె గంట సేను ఫోన్ లైన్‌లోనే ఉండిపోవలసి వచ్చింది. సోనియా గాంధీతో విభేదాల దృష్టా కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి 2004లో బిజెపిలో చేరిన రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్‌పర్సన్ నజ్మాహెప్తుల్లా ఇటీవలే విడుదల చేసిన తన ఆత్మకథ ‘ఇన్ పర్సూట్ ఆఫ్ డెమోక్రసీ: బియాండ్ పార్టీ లైన్స్’ (ప్రజాస్వామ్యం అన్వేషణలో: పార్టీల పరిధికి మించి) ఆ ఉదంతాన్ని ప్రస్తావించారు. ఆ గ్రంథాన్ని ‘రూపా’ సంస్థ ప్రచురించింది.

2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఐపియు అధ్యక్షత ‘చరిత్రాత్మకమైనది, గొప్ప గౌరవం, భారత పార్లమెంట్ నుంచి ప్రపంచ పార్లమెంటరీ వేదికకు నా ప్రస్థానానికి పరాకాష్టకు సంకేతం’ అని హెప్తుల్లా పేర్కొన్నారు. ముందుగా ఆమె బెర్లిన్ నుంచి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి ఫోన్ చేశారు, ఆయన వెంటనే ఫోన్ ఎత్తారు. ‘ఆయన ఆ వార్త విన్నప్పుడు ఎంతో ఆనందించారు, మొదటి కారణం ఏమిటంటే ఆ గౌరవం భారత్‌కు దక్కడం, రెండవది ఏమిటంటే అది ఒక భారతీయ మహిళకు రావడం. ‘మీరు తిరిగి వచ్చేయండి, మనం సంబరం చేసుకుందాం’ అని ఆయన చెప్పారు. నేను ఉప రాష్ట్రపతి కార్యాలయానికి కూడా వెంటనే కాల్ చేయగలిగాను’ అని ఆమె రాశారు. అయితే, ఆమె ‘కాంగ్రెస్ అధ్యక్షురాలు, నా నాయకురాలు సోనియా గాంధీకి ఫోన్ కాల్ చేసినప్పుడు ఆమె సిబ్బందిలో ఒకరు ‘మేడమ్ బిజీగా ఉన్నారు’ అని మొదట చెప్పారు.

నేను బెర్లిన్ నుంచి అంతర్జాతీయ కాల్ చేస్తున్నాను అని పేర్కొన్నప్పుడు ‘దయచేసి లైన్‌లో ఉండండి’ అని అతను అన్నాడు. నేను పూర్తిగా ఒక గంట సేపు నిరీక్షించాను. సోనియా నాతో మాట్లాడేందుకు ఎంతకూ లైన్‌లోకి రాలేదు’ అని హెప్తుల్లా తెలియజేశారు. తాను నిజంగా నిరాశ చెందినట్లు ఆమె తెలిపారు. ‘ఆ కాల్ తరువాత ఆమెకు నేను ఏదీ చెప్పలేదు. ఐపియు అధ్యక్ష పదవికి నా పేరు పంపించే ముందు ఆమె అనుమతి తీసుకున్నాను, ఆ సమయంలో ఆమె తన ఆశీస్సులు అందజేశారు’ అని మణిపూర్ మాజీ గవర్నర్ హెప్తుల్లా రాశారు. ‘ప్రతి దేశానికి, సంస్కృతికి, కుటుంబానికి ప్రత్యేక క్షణాలు ఉంటే, ఎంతో ముఖ్యమైన, ఏదోవిధంగా ఎంతో వ్యక్తిగతమైన, మామూలు దైనందిన జీవితంలో చోటు చేసుకున్నట్లయితే, అది నాకు అటువంటి ఒక క్షణం, అంతటి ముఖ్యమైన సమయంలో ఒక విధమైన తిరస్కార భావన నాలో పాతుకుపోయింది.

అయితే, ఆ తిరస్కరణ దూరదృష్టితో ఆలోచించేలా చేసింది. కాంగ్రెస్‌లో మార్పు జరుగుతున్న, పతనావస్థలో, సంక్షోభంలో కూరుకుంటున్న సమయం అని భావించాను. తమ సర్వస్వం పార్టీకి ధారవోసిన పాత కాలపు, అనుభవజ్ఞులైన సభ్యులు ఎటూపాలుపోని స్థితిలో పడ్డారని, నైతిక స్థైర్యం కోల్పోయారు. అనుభవశూన్యులైన వందిమాగధుల కొత్త బృందం పార్టీ వ్యవహారాలు నడపసాగారు’ అని ఆమె తెలిపారు. తాను ఐపియు అధ్యక్షురాలు అయిన తరువాత వాజ్‌పేయి ప్రభుత్వం తన పదవిని సహాయ మంత్రి స్థాయి నుంచి క్యాబినెట్ మంత్రి స్థాయికి పెంచిందని హెప్తుల్లా తెలియజేశారు. ‘ఐపియు కౌన్సిల్ డబ్బు చెల్లించని, దేశాల పర్యటనకు ఐపియు అధ్యక్షురాలి కోసం అటల్‌జీ బడ్జెట్‌లో కోటి రూపాయలు కేటాయించారు. ఐపియు అధ్యక్షురాలిగా నా ఎన్నికను పార్లమెంట్ అన్నెగ్జిలో వేడుక చేయడానికి నన్ను, ఇతర ఎంపిలను వసుంధరా రాజె ఆహ్వానించారు. ఆ అన్నెగ్జిలోనే సాధారణంగా పార్లమెంట్ రిసెప్షన్లకు ఆతిథ్యం ఇస్తుంటాం’ అని హెప్తుల్లా తన గ్రంథంలో రాశారు. ‘ఆ మరుసటి సంవత్సరం న్యూయార్క్‌లో ప్రిసైడింగ్ అధికారులు శతాబ్ది మహాసభకు హాజరు కావలసిందిగా సోనియా గాంధీని ఆహ్వానించినప్పుడు ఆమె చివరి క్షణంలో వెనుకంజ వేశారు’య అని హెప్తుల్లా తెలిపారు.

హెప్తుల్లా తన రాజకీయ జీవితానికి తోడుగా పలు గ్రంథాలు రాశారు. ఆమె ప్రజాస్వామ్య, సామాజిక న్యాయం, మహిళల హక్కుల కోసం ప్రముఖంగా వాదిస్తుంటారు. 1998లో సోనియా గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించినప్పుడు శ్రేణులు, అధినేత్రికి మధ్య ‘మరీ శ్రుతి మించి పలు అంచెల వ్యక్తులు ఆవిర్భించారు’ అని ఆమె పేర్కొన్నారు. ’10 జన్‌పథ్‌తో అదే సమస్య. జూనియర్ వ్యక్తుల కారణంగా నేరుగా సమాచారం లేకుండా పోయింది. వారు పార్టీ కార్యకర్తలు కారు, అక్కడ పని చేసే కేవలం గుమస్తాలు, ఇతర సిబ్బంది. వారు అధినేత్రిని అందుబాటులో లేకుండా చేశారు, సామరస్యాన్ని, పార్టీ సభ్యుల ఉత్పాదకతను రాజీ పెట్టి, సంస్థాగత ఆరోగ్యాన్ని, నైతిక విలువలను పణంగా పెట్టారు’ అని హెప్తుల్లా రాశారు. ‘కాంగ్రెస్ అనుయాయులుగా పార్టీ చక్కగా పని చేయడానికి ఎంతో కీలకమైన మా అధినేత్రికి సమాచారం అందజేసే క్రియాశీలక పాత్ర మాకు ఇక లేకపోయింది.

మా అభిప్రాయాల మార్పిడి నాణ్యత ఆధారంగా సమాలోచనలు స్వల్ప మాత్రం, మా అధినేత్రి వర్గంలో లేక బాహ్య వర్గంలో ఎవరు ఉన్నారన్న అవగాహన అంతంత మాత్రంచ, లేదా మా అధినేత్రి లక్షానికి ఎలా మద్దతు ఇవ్వాలో తెలియలేదు. పతనం అప్పుడే మొదలైంది’ అని ఆమె తెలిపారు. ఆ సమయంలో రాహుల్, ప్రియాంక గాంధీ రాజకీయాల్లో లేరని, వారు తమ సొంత జీవితాలతో బిజీ అని హెప్తుల్లా పేర్కొన్నారు. ‘అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో రూపుదిద్దుకున్న సహకార సూత్రాలు, అత్యుత్తమ పద్ధతులకు భిన్నంగా మా అధినేత్రి ప్రవర్తన ఉంది’ అని ఆమె సోనియా గాంధీ నాయకత్వం గురించి వ్యాఖ్యానించారు. సమాచారం వ్యాప్తికి సంబంధించి సోనియా గాంధీ భావన ‘పూర్వపు కాంగ్రెస్ సంస్కృతికి పూర్తి విరుద్ధంగా ఉంది’ అని హెప్తుల్లా అన్నారు. ‘ఇందిరా గాంధీ అందరి మాటలు వింటుండేవారు. ఆమె శ్రేణులకు అందుబాటులో ఉండేవారు’ అని హెప్తుల్లా తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News