ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు ఉన్నాయి హైకోర్టు జడ్జితో విచారణ
జరిపించాలి పౌరహక్కుల సంఘం బహిరంగ లేఖ కాంగ్రెస్
పాలనలో బూటకపు ఎన్‌కౌంటర్లు విజయోత్సవాలు నిర్వహిస్తూ
ఇదేం పద్ధతి? : బిఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌రావు ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ : ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల కమిటీ స్పందించింది. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలున్నాయని, మృతి చెందిన మావోయిస్టులకు అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజల ద్వారా తెలుస్తుందని వెల్లడించింది. మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించాలని, ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
ప్రజాస్వా మ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో 16 మందిని ఎన్‌కౌంటర్ల పేరుతో హతమార్చిందని హక్కుల సంఘం ఆరోపించింది. కాంగ్రెస్ మళ్లీ ఎన్‌కౌంటర్ల తెలంగాణగా మార్చేసిందని లేఖలో పౌర హక్కుల కమిటీ ఆగ్రహం కనబర్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర హోం మంత్రిని కలిసిన సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరడం ఆపరేషన్ కగార్‌ను రాష్ట్రంలో అమలు పరిచే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుందని హక్కుల కమిటీ లేఖలో వెల్లడించింది.
అడవిలో పోలీసు శోధన పేరుతో నిత్యం నిర్బందాలను అమలు పరుస్తూ ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను కాల్చి చంపడాన్నిపౌర హక్కుల సంఘం, రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని వెల్లడించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ పాలనలో బూటకపు ఎన్‌కౌంటర్లు : మాజీ మంత్రి హరీశ్‌రావు
అటు, ఈ ఎన్‌కౌంటర్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ పాలనలో అరెస్టులు, ఆంక్షలు, బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగు న్నాయని విమర్శించారు. అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లు అశాంతిని రేపుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలు నిర్వహిస్తుంటే ఈ పద్ధతి ఏంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించి ఆరు గ్యారెంటీలను అటకెక్కించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలన అంటూ డబ్బా కొట్టి, దానికీ తూట్లు పొడిచారని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.
మహారాష్ట్ర, చత్తీస్గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో..
గత 11 నెలల కాలంలో 200 దాటిన మావోయిస్టుల మృతుల సంఖ్య అడవిలో కాల్పుల మోత కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు పక్క వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. పోలీసుల వ్యూహాలను ఎత్తుగడలను మావోయిస్టులు చేదించలేకపోవడంతో మావోయిస్టు పార్టీకి ప్రాణ నష్టం తప్పడం లేదు. 2024 జనవరి నుండి డిసెంబర్ ఒకటో తేదీ వరకు గడిచిన 11 నెలల్లో మహారాష్ట్ర, చత్తీస్గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు దాదాపు 215 మంది మావోయిస్టులు మృతి చెందారు. 11 నెలలుగా ఎన్ కౌంటర్ ల అనంతరం పోలీసులు వెల్లడించిన లెక్కల ప్రకారం అంతమంది అన్నలు నేలకొరిగారు. ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగుతున్న మావోయిస్టుల ఏరివేతలో భాగంగా జరిగిన ఎన్కౌంటర్ లలో 215 మంది మావోయిస్టులు మృతి చెందగా, మావోయిస్టు పార్టీ ఎన్ కౌంటర్ లను ఖండిస్తూ. ఎన్ కౌంటర్లలో మావోయిస్టుల తో పాటు అమాయక గిరిజనులను చంపి మిల్టెంట్లుగా చిత్రికరిస్తున్నారని మావోయిస్టు పార్టీ అనేక సందర్భాల్లో వెల్లడించడం జరిగింది.
డిసెంబర్ 2 నుండి పి ఎల్ జి ఏ వారోత్సవాలు.
పి ఎల్ జి ఏ (ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలకు ఒక్కరోజు ముందే ఎన్‌కౌంటర్ జరగడంతో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం జరిగింది. పిఎల్‌జిఏ ఏర్పడి 24 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలకు పిలుపునిచ్చింది. ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేయడంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో మావోయిస్టుల పేరుతో బ్యానర్లు సైతం వెలిశాయి. వారోత్సవాలకు సన్నద్ధమవుతున్న క్రమంలో తెలంగాణ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరగడం సంచలనం రేపింది. పక్క సమాచారంతో పోలీసులు మావోయిస్టులను టార్గెట్ చేసి ఉంటారనే చర్చ జరుగుతుంది. దండకారణ్యంలో తీవ్ర నిర్భంధం, పోలీస్ బలగాల వ్యూహాల నుండి తప్పించుకోవడానికి సేఫ్ జోన్ లేదా ఛత్తీస్‌గఢ్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే క్రమంలో పోలీసులకు సమాచారం అందడం వారి కదలికలను గుర్తించడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకొని మావోయిస్టు మృతి చెందడం జరుగుతుంది.
తీవ్ర నిర్బంధంలోనూ ఉనికిని చాటుకుంటున్న మావోలు…
పోలీస్ బలగాల వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో కూడా మావోయిస్టులు ఉనికిని చాటుకుంటున్నారు. పది రోజుల క్రితం ములుగు ఏజెన్సీలోని వాజేడు మండలం పెనుగోలు కాలనీలో పోలీస్‌ల ఇన్ ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టుల హత్య చేసి సంచలనం రేపారు. వారోత్సవాల సందర్భంగా బ్యానర్లు కట్టడం, వాల్ పోస్టర్లు వేస్తున్నారు.