Monday, December 2, 2024

దమ్ముంటే బహిరంగ చర్చకు రండి..చార్జీ షీట్ సంగతి తేల్చుకుందాం

- Advertisement -
- Advertisement -

బీజేపీ కేంద్రంలో పదేళ్ల పాలనపై చర్చించేందుకు సిద్ధం
కాంగ్రెస్ రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన చేసి ప్రభుత్వాలను కూల్చారు
దేశంలో 45 ఏళ్లలో లేని నిరుద్యోగ పరిస్థితిని కల్పించారు
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్ :దమ్ముంటే బహిరంగ చర్చకు రండి.. చార్జీ షీట్ సంగతి తేల్చుకుందామని టీపీసీసీ అధ్యక్షులు, మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ విడుదల చేసిన చార్జిషీట్ చూస్తుంటే గురివింద సామెత గుర్తొస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది కాలం పాలనపైన బీజేపీ కేంద్రంలో పదేళ్ల పాలనపై తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మేము చర్చకు రెడీగా ఉన్నామన్నారు. పదేళ్ల బీజేపీ చీకటి పాలనపై వాళ్లకు మేము వేసే సవాల్ కు సిద్ధమా అని అన్నారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపుతామని చెప్పారని, నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి అకౌంట్ కు 15 లక్షల రూపాయలు వేస్తాం అన్నారని, వంద రోజుల్లో అన్ని రకాల ధరలు తగ్గిస్తామని, డాలర్ కు పోటీగా రూపాయి విలువ పెంచుతామని అన్నారని, 50 రూపాయలకే లీటర్ పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనేక కాంగ్రెస్ రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన చేసి ప్రభుత్వాలను కూల్చారని ఆరోపించారు. దేశంలో 411 మంది ఎమ్మెల్యేలను వివిధ పార్టీలనుంచి బీజేపీలోకి మార్చారని, దేశంలో 45 ఏళ్లలో లేని నిరుద్యోగ పరిస్థితిని కల్పించారని విమర్శించారు.

అప్రజాస్వామిక పాలన చేసి ప్రభుత్వాలను కూల్చారు : మతతత్వ రాజకీయాలు చేస్తూ, పార్టీలను చీలుస్తూ రాజకీయ పబ్బం గడిపిన బీజేపీ ఇప్పుడు సుద్దాపూస మాటలు మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ 2014, 2019, 2024 ఎన్నికల్లో ఇచ్చిన జాతీయ స్థాయి మేనిఫెస్టోలు తీసుకు వస్తే తాము 2023 మేనిఫెస్టో తీసుకు వస్తామని, ఏడాది లో ఏమి చేశామో చెపుతాం.. మీరు 11 ఏళ్లలో ఏమి చేశారో చెప్పాలని కోరారు. ఎక్కడ, ఎప్పుడు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటారు చెప్పాలన్నారు.

రాష్ట్రంలో బీజేపీ, బిఆర్‌ఎస్ ఒక్కటే అని తెలిపోవడం మొన్నటి పార్లమెంట్ ఎన్నికలో బిఆర్‌ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకోవడం తో రాష్ట్రంలో బీజేపీ ప్రతిష్ట పూర్తిగా దిగజరిపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో ఇలా చార్జిషీట్ అంటూ కొత్త రాజకీయాలకు తెరలేపారన్నారు. తెలంగాణ లో బిఆర్‌ఎస్ తో బీజేపీ అంటకాగుతుండడంతో ప్రధాని మోడీ చీవాట్లు పెట్టడంతో చార్జిషీట్ అంటూ హడావిడి చేస్తున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కవల పిల్లలు. ఒకరికొకరు ఒకరికొకరు ఏ టీం, బీ టీంగా వ్యవహరిస్తారని ఇది అనేక సార్లు రుజువైందని, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

మోడీ గ్యారెంటీ పేరుతో మభ్యపెట్టి మోసం చేశారు : 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ మోడీ గ్యారెంటీ పేరిట ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని విమర్శించారు. -2014 నుంచి 24 వరకు పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచారు? దీనిపైన చర్చించడానికి సిద్ధమా? అని అన్నారు. -కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేసిందో చర్చించడానికి బీజేపీ నాయకులు సిద్దమా?. -కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేసిందో చర్చించడానికి బీజేపీ నాయకులు సిద్దమా?.

-రైతుల సంక్షేమం కోసం ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు 54 వేల కోట్లు ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వానిది. దీనిపై చర్చిద్దామా? ఇది బీజేపీ నాయకులకు కనపడటం లేదా? అని నిలదీశారు. -ఢిల్లీలో రైతులు తమ న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేస్తే వారిపై లాఠీలతో, తుటాలతో గాయపర్చడమే కాకుండా, వారిపై అక్రమ కేసులు బనాయించిన ఘనత బీజేపీదని ఆరోపించారు. -కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో పెండింగ్ ఉద్యోగ ఖాళీలలను భర్తీ చేయడం..తెలంగాణ బీజేపీ నాయకులను కనపడటం లేదా?. 200 యూనిట్ల వరకు గృహ జ్యోతి కింద ఉచిత కరెంటు ఇస్తున్నాం, ఇది బీజేపీ నాయకులకు కనపడటం లేదా? అని అన్నారు. 21 వేల కోట్లతో రుణమాఫీ, రైతుపెట్టుబడికి 7600 కోట్లు, ధాన్యం కొనుగోళ్ల కోసం 10, 500 కోట్లు… 42 లక్షల మంది రైతులకు భీమా కవరేజ్ కోసం 1400 కోట్లు, అకాల వర్షాలకు నష్టపోయిన 94వేల రైతులకు ఎకరానికి 10 రూపాయిలు ఇచ్చాం. ఇవేం బీజేపీ నాయకులకు కనపడటం లేదా? అని మహేష్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News