Monday, December 2, 2024

కిషన్‌రెడ్డి కాదు.. కిస్మత్‌రెడ్డి!

- Advertisement -
- Advertisement -

ఆయన ఎంపికి ఎక్కువ..
కేంద్ర మంత్రికి తక్కువ: మంత్రి పొన్నం

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై, మోడీ గ్యారెంటీలపై బహిరంగంగా చర్చించడానికి బీజేపీ నేతలు సిద్ధమా..? అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన సందర్భంగా బీజేపీ నేతలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ చివాట్లు పెట్టారని, ఆ కారణంగానే చార్జ్ షీట్ అని, తెలంగాణ బీజేపీ నాయకులు హడావిడి చేస్తున్నారని అన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్ కవల పిల్లలుగా అభివర్ణించిన మంత్రి పొన్నం ఒకరికొకరు ఏ టీమ్, బీ టీమ్‌గా వ్యవహరిస్తున్న విషయం అనేక సార్లు రుజువైందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన పేరును ‘కిస్మత్‘ రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కిషన్ రెడ్డి ఎంపీకి ఎక్కువ, కేంద్ర మంత్రికి తక్కువ అని ఎద్దేవా చేశారు. 2024 పా ర్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ‘మోడీ గ్యారెంటీ‘ పేరిట ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని ఆయన తెలిపారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని, మభ్యపెట్టి మోసం చేస్తోందని దుయ్యబట్టారు. -2014 నుంచి 24 వరకు పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచారు? దీనిపైన చర్చించడానికి సిద్ధమా?, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేసిందో చర్చించడానికి బీజేపీ నాయకులు సిద్ధమా?, రైతుల సంక్షేమం కోసం ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు 54 వేల కోట్లు ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలియజేస్తూ దీనిపై చర్చిద్దామా..? అని బిజెపి నాయకులకు సవాల్ చేశారు.

ఢిల్లీలో రైతులు తమ న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేస్తే వారిపై లాఠీలతో, తుటాలతో గాయపర్చడమే కాకుండా, వారిపై అక్రమ కేసులు బనాయించిన ఘనత బీజేపీదేనని తెలిపారు. 200 యూనిట్ల వరకు గృహ జ్యోతి కింద ఉచిత కరెంటు ఇస్తున్నామని, ఇది బీజేపీ నాయకులకు కనపడటం లేదా..? అని నిలదీశారు. రూ. 21వేల కోట్లతో రుణమాఫీ, రైతు పెట్టుబడికి రూ.7600 కోట్లు, ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.10, 500 కోట్లు, 42 లక్షల మంది రైతులకు భీమా కవరేజ్ కోసం రూ.1400 కోట్లు, అకాల వర్షాలకు నష్టపోయిన 94 వేల రైతులకు ఎకరానికి 10 రూపాయిలు ఇచ్చామని తెలిపారు. ఇవేమీ బీజేపీ నాయకులకు కనపడటం లేదా? అని పొన్నం ప్రశ్నించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ , యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ తెచ్చామని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News