గత వైసిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌పై తీసిన ‘వ్యూహం’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌పై అనుచిత పోస్టులు పెట్టిన విషయంలో టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు సోమవారం తాత్కాలిక ఊరట లభించింది. తనను అరెస్టు చేసేందుకు ఎపి పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎపి హైకోర్టు వచ్చే వారం వరకూ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇచ్చింది. వర్మ సోషల్ మీడియా పోస్టులపై ప్రకాశం జిల్లా మద్దిపాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని, కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది.
దీంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో పాటు ఈ కేసులన్నీ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ కూడా వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మాత్రం వచ్చే సోమవారానికి వాయిదా పడింది. అప్పటివరకు వర్మపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రామ్‌గోపాల్‌వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 9 లోగా కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ ఆధారంగా వచ్చే సోమవారం వర్మ అరెస్టుతో పాటు బెయిల్ వ్యవహారం కూడా తేలనుంది.