హైదరాబాద్- బీజాపూర్ అంతర్ రాష్ట్ర రహదారి నేరుగా యమపురికి ద్వారాలుగా పేరుపడింది. నిత్యం ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం కానీ.. అధికార యంత్రాంగంగానీ పట్టించుకున్న పాపానపోలేదు. పదేళ్ల క్రితం హైదరాబాద్ బీజాపూర్ అంతర్‌రాష్ట్ర రహదారిని విస్తరిస్తున్నామని చెప్పిన ఆనాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టుమని ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని అనుభవించిందే కానీ పట్టుమని పది కిలోమీటర్ల రోడ్డును నిర్మించలేకపోయింది. మన్నేగూడ నుంచి చేవెళ్ల, మెయినాబాద్ మీదుగా అప్పా జంక్షన్ వరకు రోడ్డు నిర్మాణానికి గాను భూసేకరణ చేపట్టకపోవడం… నాన్చుడి ధోరణితో వ్యవహరించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రాంతం నుంచి గతంలో అధికారం అనుభవించి… చేవెళ్ల చెల్లెమ్మగా ప్రసిద్ధి గాంచిన పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి కూడా ఈ రోడ్డు నిర్మాణ పనులను జరిగేలా చూడలేకపోయారు. మూడు పర్యాయాలుగా చేవెళ్ల శాసన సభ్యుడిగా గెలుపొందిన కాలె యాదయ్య తన పదవిని కాపాడుకునేందుకే ప్రయత్నం చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అంతేగాకుండా కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్‌కు మళ్లీ ఇప్పుడు బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారారే తప్పా చేవెళ్ల ప్రాంతంలోని రోడ్డు, ఇతర అభివృద్ధికి ఎలాంటి పనులు చేపట్టడంలేదని చేవెళ్ల నియోజకవర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా బీజాపూర్ హైదరాబాద్ రోడ్డును, చేవెళ్ల ప్రాంతాన్ని పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో చేవెళ్ల ఎంపిగా పనిచేసిన గడ్డం రంజిత్‌రెడ్డి ఈ రోడ్డు పనులను ప్రారంభిస్తున్నామని ఎన్నోమార్లు ప్రకటనలు గుప్పించారు. ఈ రోడ్డు పనులకు సంబంధించి నేటికీ మన్నేగూడ చేవెళ్ల ప్రాంతం నుంచి తట్టెడు మట్టిని కూడా ఎత్తలేకపోయారు. చేవెళ్ల ప్రాంతం నుంచి ఎవరిని గెలిపించినా వారి స్వలాభం కోసం కృషిచేసుకుంటున్నారే.. తప్పా… ప్రజా ప్రయోజనాల కోసం ఒక్క నాయకుడు కూడా పాటుపడడంలేదు. ఈ విషయాన్ని చేవెళ్ల నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారో తెలియడం లేదు. ఈ చేవెళ్ల ప్రాంతం ప్రజల్లో చైతన్యం వచ్చి నాయకులను నిలదీస్తేనే హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా ఉంది.
హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ప్రయాణమంటేనే.. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు గాల్లో కలిసే పరిస్థితి నెలకొంది. ఈ జాతీయ రహదారిపై వారానికి పదుల సంఖ్యంలో ప్రమాదాలు జరగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది అవిటివారిగా మారి దుర్బర జీవితాలను గడుపుతున్నారు. బీజాపూర్ హైదరాబాద్ అంతర్ రాష్ట్ర రహదారికి విస్తరణ పనులు చేపడితే ప్రమాదాలు తగ్గి ప్రయాణికులకు సమయం కూడా ఆదా అవుతుంది. రహదారి విస్తరణ కోసం గత ప్రభుత్వం భూసేకరణను కూడా చేపట్టింది. రహదారి నిర్మాణ పనులను అప్పట్లో మేగా ఇంజనీరింగ్ సంస్థ అప్పగించింది. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి సమీపంలో రోడ్డు నిర్మాణం పనులకు సంబంధించి హెవీ మిషన్లను అక్కడ దించారు. గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే మేగా ఇంజనీరింగ్ సంస్థ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టేందుకు అనాసక్తి చూపిందనే ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి నేటివరకు రోడ్డు పనులు అక్కడే వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. చేవెళ్ల నియోజకవర్గం ప్రజలు ఈ రోడ్డు గురించి చర్చించుకుంటున్నారనే విషయం అధికార యంత్రాంగం దృష్టికి పోవడంతో గత వారం అక్కడక్కడ రోడ్డు పనులను ప్రారంభిస్తున్నట్లు ఎంఎల్‌ఎ కాలె యాదయ్య ఫోటోలకు ఫోజులిస్త్తూ ప్రకటనలకే పరిమితమయ్యారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ సర్కారు కొలువు దీరింది. ఇప్పుడైనా బీజాపూర్ హైదరాబాద్ అంతర్ రాష్ట్ర రహదారికి మోక్షం లభిస్తుందని ఈ ప్రాంత ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ అది నిరాశగానే మిగిలిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడుస్తున్నా నేటికీ రహదారి నిర్మాణానికి సంబంధించి విధివిధానాలను రూపొందించలేకపోయింది. బీజాపూర్ హైదరాబాద్ అంతర్ రాష్ట్ర రహదారి 46 కిలోమీటర్ల నాలుగు లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కూడా పదేళ్ల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.956 కోట్ల నిధులు మంజూరు చేస్తూ మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి రోడ్డు కాంట్రాక్టు పనులను అప్పగించినట్లు అప్పటి అధికార యంత్రాంగం చెప్పింది. కానీ నేటికీ ఒక్కచోట కూడా విస్తరణ పనులను ప్రభుత్వంకాని, కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా కంపెనీ పనులను చేపట్టలేకపోయింది. నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం ఈరోడ్డుపై జరుగుతూనే ఉంది. వేల సంఖ్యలో వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు కొనసాగుతుంటాయి.
ఈ రోడ్డుపై ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రం అధికారులు అదిగో.. ఇదిగో.. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమవుతాయంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్పా.. పనుల్లో పురోగతి లేదు. నాలుగేళ్ల్ల క్రితమే బీజాపూర్ హైదరాబాద్ అంతర్ రాష్ట్ర రహదారి విస్తరణ పనులను ప్రారంభిస్తున్నామని అప్పటి అధికార యంత్రాంగం తెలిపారు. అక్కడక్కడ మట్టి నమూనాలను సేకరించారు. రోడ్డు వేసేందుకు అనువుగా ఉందా.. లేదా పరీక్షలను చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ కోసం భూమిని సేకరించారు. గత నాలుగేళ్లలో రోడ్డు నిర్మాణం కోసం నేటికి తట్టెడు మట్టిని కూడా ఎత్తలేదంటే పనులు ఏవిధంగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికార యంత్రాంగం మాత్రం అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్షం కారణంగా ఈ రహదారిపై ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. అధికారులు రహదారులపై ప్రమాదాల జోన్లను గుర్తించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉండగా… ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఇప్పటివరకు సూచిక బోర్డులను ఏర్పాటు చేసిన దాఖాలాల్లేవు. ముఖ్యంగా ఈ అంతర్ రాష్ట్ర రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిపై వారంలో మూడు, నాలుగు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రమాదాల్లో ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. హైదరాబాద్ నగరం నుంచి ప్రారంభమైన ఈ రోడ్డుపై ఎన్ని మలుపులున్నాయె అధికారులకు కూడా తెలియదు. ఈ రోడ్డుకు అనుసంధానంగా లింకు రోడ్డులు కూడా చాలానే ఉన్నాయి. రోడ్డుపై ఇన్ని మలుపులున్నా ఒక్క సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేయలేదంటే వారి పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూలమలుపుల్లో ప్రమాదాలు జరిగడంతో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు అవిటివారిగా మారి జీవచ్ఛవల్లా బతుకును వెళ్లదీస్తున్నారు. మూడున్నర ఏళ్ల క్రితం హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు తమ వాహనంలో గుర్మిటికల్‌కు వెళ్తుండగా చేవెళ్ల మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. అ ప్రమాదంలో ఓ చిన్నారి మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. నిత్యం ఈ రోడ్డుపై ఏదో ప్రమాదం జరుగుతూనే ఉన్నా.. అధికారుల్లో మాత్రం చలనం రావడంలేదు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రోడ్డు విస్తరణ పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని చేవెళ్ల నియోజకవర్గం ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు అవగాహన కల్పించాలి.
మలుపుల వద్ద సూచిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అతివేగమే ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నా.. మద్యం సేవించి వాహనాలను నడపడంవల్లే అధిక శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా యువతనే ప్రమాదాల బారిన పడి తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. రోడ్డు మద్యలో పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ డివైడర్‌లను ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో అవి కూడా విరిగి రోడ్డుపై పడిపోతున్నాయి. వాహనాలను నడిపేవారు తమ వాహనాన్ని అదుపులో ఉంచుకునేలా నడుపుకుంటే ప్రమాదాలను కొంతమేరకు నివారించవచ్చు. వాహనదారులకు పోలీసులు కూడా కౌన్సెలింగ్ నిర్వహించి.. వాహనాల స్పీడు పరిమితిని వారికి తెలియజేస్తూ రోడ్లపై స్పీడు లిమిట్ బోర్డులను ఏర్పాటు చేస్తే కొంత మేరకు ప్రమాదాలను నివారించవచ్చు.
చెట్లతొలగింపు.. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు.
మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు సుమారు 705 భారీ వృక్షాలు తొలగించడంతో పర్యావరణానికి తీరని అన్యాయం జరుగుతుందని పర్యావరణ ప్రేమికులు కొందరు గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో నాలుగేళ్లుగా గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తూనే ఉంది. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో భూసేకరణకు కూడా అడ్డంకి ఏర్పడింది. భూములు కోల్పోతున్న కొందరు రైతులు కోర్టులను ఆశ్రయించారు. తమకు 2018లో ఇచ్చిన జిఓ ప్రకారం కాకుండా ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందించాలని భూములు కోల్పోతున్న రైతులు కేసులను ఫైల్ చేశారు. ఇదికూడా రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకిగా మారింది. రోడ్డు విస్తరణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించి త్వరతగతిన పనులు చేపట్టేలా చూడాల్సిన అవసరముంది.