Friday, January 10, 2025

ఏడాది పాలనలో ఎన్నో కోల్పోయారు

- Advertisement -
- Advertisement -

రెండు కాదు.. మూడో మాట
కూడా మార్చగల నేర్పరి
పోటీ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రిది..
డబుల్ కాదు.. ట్రిపుల్ స్టాండర్డ్
ఏడాది పాలనలో రైతుబంధు,బతుకమ్మ చీరలు,
ఎల్‌ఆర్‌ఎస్, కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా..
ప్రతి అంశంపై సిఎం మాట మార్చారు
మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి.

సిఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు…
ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దు
రాష్ట్ర ప్రజలకు హరీష్‌రావు సూచన
గతంలో మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి అన్నారని, ఆయన సిఎం అయ్యాక ఉన్నత రైతుబంధునే ఇవ్వట్లేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి.హరీష్‌రావు అన్నారు. ఏడాది పాలనలో రైతుబంధు,బతుకమ్మ చీరలు, ఎల్‌ఆర్‌ఎస్, కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా.. ప్రతి అంశంపై సిఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని విమర్శించారు. ఆడపిల్లను మోసం చేయటమంటే పాపం చేసినట్లు తెలంగాణ సమాజం భావిస్తుందని అన్నారు. ఈ ఏడాది కాలంలో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. రైతుబంధు, బతుకమ్మ చీరలు, పెన్షన్లు చాలా కోల్పోయారని హరీష్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మాజీ స్పీకర్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, లకా్ష్మరెడ్డి, బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

‘నాడు నేడు’ పేరుతో.. ఎన్నికల ప్రచారంలో సిఎం ఇచ్చిన హామీలను స్క్రీన్‌లో ప్రదర్శించారు. మాటలు మార్చటంలో రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని.. రెండు కాదు.. మూడో మాట కూడా మార్చగల నేర్పరి అని విమర్శించారు. పూటకో పార్టీ మార్చటం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, రాక్షసులు అన్న నోటితోనే.. దేవత అని పొగడగల సామర్థ్యం రేవంత్ రెడ్డి సొంతమని అన్నారు. ఏడాది పాలనలో కూల్చివేతలు తప్ప.. రేవంత్ నిర్మించినవి లేవని పేర్కొన్నారు. తనది కూడా పోలీస్ కుటంబం అన్న రేవంత్‌రెడ్డి…పోలీస్ కుటుంబాలను రాచిరంపాన పెడుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ కట్టొద్దని ప్రజలను కోరుతున్నామని చెప్పారు. పోటీ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రిది.. డబుల్ కాదు.. ట్రిపుల్ స్టాండర్డ్ అని, పార్టీ ఫిరాయింపుల విషయంలో సైతం రేవంత్ రెడ్డి మాట మార్చారని విమర్శించారు. సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించబోయే.. కోకాకోలా కంపెనీకి సరఫరా అయ్యే నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళేనని హరీష్‌రావు అన్నారు.

సోనియా గాంధీ కూడా బలయ్యారు..
సిఎం రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్‌కు.. సోనియా గాంధీ కూడా బలయ్యారని హరీష్‌రావు విమర్శించారు. పచ్చ పార్టీలో ఉన్నప్పడు సోనియా బలిదేవత.. మూడు రంగుల జెండా పట్టగానే దేవత అయ్యారని అన్నారు. అవసరమైతే కాళ్ళు పట్టుకోవటం.. తర్వాత కాళ్ళు గుంజటం ముఖ్యమంత్రి నైజమని విమర్శించారు. రాళ్ళు వేయటం… పువ్వులు వేయటంలో కూడా సిఎం దిట్ట అని.. సమగ్ర సర్వేపై అప్పట్లో విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు వేయటం లేదా..? అని ప్రశ్నించారు. కూల్చివేతల విషయంలో ఆనాడు ఏం మాట్లాడారు… ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. నాడు మద్యం వద్దని మాట్లాడారని.. ఇప్పుడు మద్యమే ప్రభుత్వానికి మాద్యమైందన్నారు. ఎవరు తాగుబోతుల తెలంగాణ చేస్తున్నారో సిఎం రేవంత్ రెడ్ది చెప్పాలని అడిగారు.

సిఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు
సిఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు అని, ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దని హరీష్‌రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. చైతన్యవంతులైన ప్రజలు ఇకనైనా ఇటువంటి రెండు నాల్కల ధోరణి గల నాయకులను నమ్మి మోసపోవద్దని, మోసపోతే ఎంతో గోస పడుతరని చెప్పాలనేది నా ఆరాటం అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులను ప్రజలు నిశితంగా పరిశీలిస్తుంటారని, రాజకీయ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని బాధ్యతగా మాట్లాడాలి.. మెలగాలని పేర్కొన్నారు. ప్రజలు పిచ్చోళ్లు మనం ఏదైనా మాట్లాడొచ్చు.. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడొచ్చు అని సిఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోసం చేయడం తమకు అలవాటు, మోసపోవడం ప్రజలకు అలవాటు అని నిస్సంకోచంగా రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలకు చూపించాలన్నదదే తన తపన అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని చూస్తే పిల్లలు చెడిపోతారని చానెల్స్ మారుస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి భాష, తీరుకు తల్లిదండ్రులు భయపడుతున్నారని, మా పిల్లల మీద ప్రభావం పడే అవకాశం ఉందని బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని నమ్మితే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయిందన్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రజలకు మాటిస్తే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చావు… కానీ ఇప్పుడు మాట మారుస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. మోసం దగా
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. మోసం దగా.. వంచనకు నిలువెత్తు నిదర్శనమని హరీష్‌రావు విమర్శించారు. నక్సలైట్లు ఉండాలని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు వద్దు అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. తెలంగాణలో మూడో ఫేక్ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆరోపించారు. ఫార్మాసిటీ కాదని లెఫ్ట్ పార్టీల నేతలకు చెప్పి.. ఇప్పుడు మాట మార్చారని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నోటికి మెక్కాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపరిచితుడని విమర్శించారు. రైతు బరోసా ఒక పంటకు కాదని.. రెండు పంటలకు ఇవ్వాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో.. ప్రజాస్వామ్య హననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనకు రూ. లక్షా 50 వేల కోట్లు అని.. తర్వాత ఎవరన్నారని సిఎం దబాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారులపై గతంలో హైకోర్టుకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎలా నియమించారని హరీష్ రావు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News