న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో సిబిల్ స్కోరు వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించే సిబిల్ స్కోర్లపై విశ్వనీయత, జవాబుదారీతనం మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. వ్యవస్థ పారదర్శకత, నిష్పాక్షికతపై అనుమానం వ్యక్తం చేశారు. సిబిల్ స్కోర్ నిర్వహణకు మెరుగైన యంత్రాంగం లేకపోవడాన్ని చిదంబరం నొక్కి చెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న సిబిల్ నిర్వహణ చాలా మంది భారతీయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తోందన్నారు.
అసలు సిబిల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సిబిల్ స్కోరు అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్(సిబిల్) వారిచ్చే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఓ వ్యక్తి తీసుకున్న రుణాలు, చెల్లింపుల వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ సిబిల్ స్కోర్ ఇస్తారు. ఈ స్కోర్ 750-900 మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని అర్థం. ఇలా ఎక్కువ స్కోర్ ఉంటే లోన్ త్వరగా పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏ బ్యాంకయినా తక్కువ స్కోర్ ఉన్నవారికి అప్పు ఇస్తే, ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేసే అవకాశం ఉంటుంది.
మీ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు అధికారిక వెబ్ సైట్ www.cibil.com కి లాగిన్ అవ్వాలి. ఆన్ లైన్ లో ఫారం పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డు, బ్యాంకుకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని పూర్తి చేసి సమర్పిస్తే క్రెడిట్ రిపోర్టు మెయిల్ ద్వారా పంపిస్తారు.