రూప్ నగర్: సిక్కుల అత్యున్నత సంస్థ ‘అకాల్ తఖ్త్’ విధించిన శిక్షను పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ గురువారం కూడా పాటించారు. ఇందులో భాగంగా రూప్ నగర్ జిల్లాలోని తఖ్త్ కేస్ ఘర్ సాహిబ్ లో సేవాదార్ గా ఆయన విధులు నిర్వర్తించారు. నీలం రంగు యూనిఫామ్ ను ధరించి మొదట గంటపాటు గురుద్వారాకు సెక్యూరిటీ గార్డుగా సేవలు అందించారు. ఆ తర్వాత అక్కడి సిబ్బందితో కలిసి గురుద్వారాలోని వంటశాలలో అంట్లు తోమారు. ఆహారం తయారు చేసిన గిన్నెలను శుభ్రం చేశారు. వీల్ ఛైర్ లో కూర్చునే తన విధులను నిర్వర్తించారాయన.
ఇదిలావుండగా సుఖ్బీర్ సింగ్ బాదల్ పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసు భద్రత మరింత పెంచారు. ప్రస్తుతం ఆయనకు జెడ్ క్యాటగిరి భద్రత ఉంది.
2007 నుంచి 2017 మధ్యకాలంలో పంజాబ్ రాష్ట్రాన్ని శిరోమణి అకాలీదళ్ పార్టీ పాలించింది. అప్పట్లో అకాలీదళ్ ప్రభుత్వం తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలు సిక్కుల మనోభావాలను దెబ్బతీసాయి. దీనిపై విచారణ జరిపిన ‘అకాల్ తఖ్త్’ సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సహా మరో వ్యక్తిని 2024 ఆగస్టులో దోషులుగా నిర్దారించింది. వారికి ఇటీవలే శిక్షలను కూడా ప్రకటించింది. ఆ శిక్షనే సుఖ్బీర్ సింగ్ బాదల్ ఇప్పుడు పాటించారు.