పారిశ్రామికంగా బుగ్గపాడు ఫుడ్ పార్క్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, బుగ్గపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్‌పార్క్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎంఎల్‌ఎ డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా చైతన్య వంతమైన జిల్లా అని, రాజకీయంగా, విద్యాపరంగా ముందున్నదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు సత్తుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హయాంలో ఇక్కడ రోడ్లు, కాలువలు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి తుమ్మల ప్రతి రోజు ఈ ఫుడ్ పార్క్ ను ప్రస్తావిస్తూ, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సంప్రదించి ఫుడ్ పార్క్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఐటి రంగం, ఉపాధి కల్పన జరగాలని, స్థానిక నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు కల్పించాలని ప్రభుత్వం పనిచేస్తోదన్నారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దామని, నేడు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమానికి నాంది పలికామన్నారు. ఆయిల్ పామ్ పంటల సాగు ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతోందని మంత్రి తుమ్మల విస్తృతంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో అందుబాటులో ఉన్న రా మెటీరియల్ వాల్యూ అడిషన్ చేస్తూ శాస్త్రీయబద్ధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతామని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలకు సబ్సిడీలు అందిస్తూ స్థానిక యువతకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాలలో వాటా కల్పించింది ప్రజా ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఇక్కడ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. ఖమ్మంలో గ్రానైట్, రైస్‌మిల్లర్లు, జిన్నింగ్ మిల్లు తదితర 2300 పైగా పరిశ్రమలున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో 10 వేల ఎం.ఎస్.ఎం.ఈ. పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నారు.
వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఫుడ్ పార్క్‌లో అధిక పరిశ్రమలు తీసుకుని వచ్చి ఈ ప్రాంత రైతులు పండించే జామ, కొబ్బరి, ఆయిల్ పామ్ మొదలగు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. బుగ్గపాడు మెగా ఫుడ్‌పార్క్ లో మొత్తం 200 ఎకరాలకు పైగా అందుబాటులో ఉందని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని రావాలన్నారు. ఆహారశుద్ధి పరిశ్రమల ద్వారా రైతుల ఆదాయం పెరగాలని, అటువంటి పరిశ్రమలు టి.జి.ఐ.ఐ.సి. అధికారులు తీసుకుని రావాలన్నారు. సభా స్థలి వద్ద తెలంగాణ నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్, తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వారు ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ స్టాల్‌లను మంత్రులు, ఎమ్మెల్యే పరిశీలించి ఎల్లో అండ్ గ్రీన్ టెక్నాలజీస్ సంస్థను ప్రారంభించారు. స్థానిక ఎంఎల్‌ఎ డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ.. బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భూమిని కేటాయించారని,
గత పాలకులు ఈ ఫుడ్‌పార్క్‌పై నిర్లక్ష్యం వహించగా, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక వసతుల పనులలో వేగం పెంచి నేడు ప్రారంభిస్తున్నామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో జలగం వెంగళరావు, తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావు వంటి మహనీయులు ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి మహిళగా తాను ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉందన్నారు. సత్తుపల్లిలో సింగరేణికి సంబంధించిన నాణ్యమైన బొగ్గు అందుబాటులో ఉందని, ఇక్కడ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, బొగ్గు ఆధారిత చిన్న, సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. పొలాలకు వెళ్లే మార్గాల్లో రోడ్లు వేయాలని, బేతుపల్లి కాలువ, లంకాసాగర్ ప్రాజెక్టు మరమ్మతు పనులు పూర్తి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. ఫుడ్‌పార్క్ పరిధిలో లక్ష ఎకరాల వరకు వ్యవసాయ భూమి క్యాచ్మెంట్ ఏరియాగా ఉందని, ఇక్కడ పండించే పంటలు ఆహార శుద్ధి పరిశ్రమకు ఉపయోగపడతాయన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో సత్తుపల్లి నుంచి బుగ్గపాడు వరకు భారీ మోటర్ సైకిల్ కార్ల ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, టి.జి.ఐ.ఐ.సి. ఛైర్మన్ టి. నిర్మల జగ్గారెడ్డి, హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ నాయుడు సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, ఈ.డి పవన్ కుమార్, పలు శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.