Thursday, December 12, 2024

పదేళ్ల తెలంగాణ ప్రగతి నుంచి ఇతర రాష్ట్రాలు అనేక పాఠాలు నేర్చుకోవచ్చు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

పదేళ్ల తెలంగాణ ప్రగతి నుంచి ఇతర రాష్ట్రాలు అనేక పాఠాలు నేర్చుకోవచ్చని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభిప్రాయపడ్డారు. ప్రతి అంశంలోనూ రాష్ట్రాల మధ్య పోలిక చేయడం అవసరం లేదని, ఆయా రాష్ట్రాలకు తమ తమ బలాలు, ప్రాధాన్యతలు గుర్తించి, వాటి ఆధారంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రాలు అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించాయని, వాటి అనుభవాల నుంచి తగిన పాఠాలు నేర్చుకోవడం ద్వారా అన్ని రాష్ట్రాలు ప్రగతి బాటలో పయనించవచ్చని చెప్పారు. కేరళలోని కొచ్చి నగరంలో గురువారం జరిగిన టైకాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు. కేరళ రాష్ట్రం సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధించిన ప్రగతిని ఆధారంగా తీసుకుని అనేక అంశాలను నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

తన వ్యక్తిగత హోదాలో, కేరళ రాష్ట్రంలో ఎంటర్‌ప్రీన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ కోసం అవసరమైన మద్దతు ఇస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో ఉన్న పారిశ్రామిక దిగ్గజ సంస్థలు, విశ్వవిద్యాలయాల వంటి ఉన్నత విద్యాసంస్థల భాగస్వామ్యాలను చేసేందుకు సహకారం అందిస్తానని తెలిపారు. స్వతహాగా మలయాళీలు కష్టపడే తత్వం కలిగిన వారు అని, ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా అక్కడ కనిపించే కేరళ పారిశ్రామికవేత్తలను చూసినప్పుడు అర్థమవుతుందని కెటిఆర్ అన్నారు. ఇదే తీరుగా సొంత రాష్ట్రం కేరళలోనూ పెట్టుబడులను పెంచే కార్యక్రమాన్ని చేపట్టగలిగే శక్తి ప్రతి ఒక్క మలయాళీలోనూ ఉందని ప్రశంసించారు. కేరళ రాష్ట్రంలో పెట్టుబడులకు దోహదం చేయడంలో టైకాన్ కేరళ ప్రతినిధులు కృషిని కెటిఆర్ అభినందించారు.

టీఎస్ ఐపాస్ విధానం అనేక ప్రశంసలను అందుకున్నది
కేరళ వంటి రాష్ట్రాలు సైతం తెలంగాణ విధానాల నుంచి నేర్చుకొని ముందుకు పోవచ్చు అని కెటిఆర్ పేర్కొన్నారు. కేవలం తెలంగాణ మాత్రమే కాదు ప్రపంచంలోని అత్యుత్తమ దేశాల పారిశ్రామిక విధానాలను పరిశీలించి వాటిలోని అద్భుతమైన అంశాలను స్వీకరించాలని అభిప్రాయపడ్డారు. వీటితోపాటు ఆయా రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక పరిస్థితులు అవసరాలను, ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పాలసీలను రూపొందిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలు, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆధారిత టిఎస్ ఐపాస్, తెలంగాణ ఐటి పాలసీ వంటి అనేక ఇతర పాలసీలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా ముందుకు తీసుకుపోయాయని చెప్పారు. టీఎస్ ఐపాస్ విధానం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశంసలను అందుకున్నదని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో మహిళ పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు గతంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలతో పాటు విద్య అనంతరం ఉపాధి అవకాశాలను పెంచేందుకు వారిని పరిశ్రమలకు కంపెనీలకు అవసరమైన తీరుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది పేర్కొన్నారు. అందుకే గత పది సంవత్సరాలలో తమ ప్రభుత్వం టాస్క్ వంటి శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు పరిశ్రమలకు యూనివర్సిటీలకు ఉన్నత విద్య సంస్థలకు మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. యువత అపజయాలకు కృంగిపోవల్సిన అవసరం లేదని, ఓటమిని కూడా సెలబ్రేట్ చేసుకొని మరింత స్పూర్తితో గెలుపు వైపు ముందుకు పోయినప్పుడే జీవితంలో ఉన్నత విజయాలు సాధ్యమవుతాయని కెటిఆర్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News