Thursday, December 12, 2024

మానవ మనుగడకు నేల జీవనాధారం

- Advertisement -
- Advertisement -

మానవుడు అభివృద్ధి పేరుతో చేపడుతున్న అనేక స్వార్ధపూరిత చర్యల వల్ల పర్యావరణం గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వాతావరణంలోకి నిత్యం పెద్దయెత్తున్న విడుదలవుతున్న కలుషితాల వల్ల రుతువులు గతి తప్పాయి. సహజ వనరులు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. కోట్లాది ఎకరాల సాగు భూములు తమ సారాన్ని కోల్పోయి బీడు భూములుగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పచ్చిక బయళ్లు ధ్వంసం కావటం వల్ల కూడా మేత లేక ఏటా లక్షలాది పశువులు మృత్యువాతపడుతున్నాయని, వీటిని రక్షించుకోవాలంటే నేల క్షీణతను అరికట్టి, తిరిగి వాటిని పునరుద్ధరించటం ఒకటే మార్గమని పర్యావరణ వేత్తలు హితవు పలుకుతున్నారు. సృష్టిలోని సమస్త జీవరాశి మనుగడకు కావాల్సిన ఆహారాన్ని, ఆవాసాన్ని అందించేది నేల తల్లే. జీవన ధాతువుగా నిలవాల్సిన ఆ నేలతల్లే మానవుని స్వార్ధపూరిత చర్యల వల్ల వెదజల్లబడుతున్న కాలుష్యం వల్ల తల్లడిల్లుతున్నది.

వాతావరణ మార్పులు, మానవ ప్రేరిత చర్యల వల్ల భారత దేశంలో 32% నేల క్షీణతకు గురవుతుండగా, 25% భూమి ఎడారిగా మారిపోతున్నదని భారత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో 2015 నుండి 2019 వరకూ అంటే నాలుగు సంవత్సరాల కాలంలో సుమారు 30.51 మిలియన్ హెక్టార్ల భూమి క్షీణతకు గురై బీడు బారిపోయిందని యునైటేడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ (యుఎన్‌సిసిడి) అనే సంస్థ తన నివేదికలో అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం 2019 నాటికే దేశ భూభాగంలో సుమారు 9.45 శాతం భూమి క్షీణతకు గురయ్యింది. 2023లో యుఎన్‌సిసిడి విడుదల చేసిన తాజా నివేదికలో భారతదేశ జనాభాలో దాదాపు 18.39 శాతం మంది ప్రజలు భూక్షీణత, ఎడారీకరణ వల్ల అనేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. జీవపరిణామ క్రమంలో అత్యంత విలువైన, సమర్ధవంతమైన, సజీవమైన పాత్రను పోషించిన భూమి నేడు అత్యంత వేగంగా క్షీణతకు గురికావటం ఒక విషాదం.

పర్యావరణ వ్యవస్ధలలో మార్పులు రావటం వల్ల సంభవిస్తున్న వర్షాభావ పరిస్థితుల కారణంగా జలవనరులు తగ్గిపోగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నేలలోని పోషకాలు నశించిపోవటం వల్ల పెద్దయెత్తున భూమి క్షీణతకు గురై ఎడారిగా మారిపోతుంది. గడిచిన 10 సంవత్సరాలలో సుమారు 15 లక్షల హెక్టార్ల సాగుభూమి ఎడారిగా మారిపోయింది. పరిస్ధితులు ఇలాగే కొనసాగితే రానున్న 10 సంత్సరాల కాలంలో 40 శాతానికి పైగా నేల తన జీవత్వాన్ని కోల్పోయి ఎడారిగా మారిపోతుందని ఒక అంచనా. నేల క్షీణత వల్ల 2050 నాటికి ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది తీవ్రమైన కరువును ఎదుర్కొంటారు. దీంతో కోట్లాది మంది ప్రజలు పర్యావరణ శరణార్ధులుగా మారి పొట్టచేత బట్టుకుని ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వలస పోవాల్సి వస్తుంది. వర్షాభావ పరిస్థితులు, జల వనరులు తగ్గిపోవటం, భూతాపం వల్ల నేలలోని మూలకాలు నశించిపోవటం వల్ల వేలాది ఎకరాల సాగు భూమి ఎడారిగా మారిపోతుంది.

ఇది రానున్న రోజులలో ఆహార సంక్షోభానికి కారణమవ్వటంతో పాటు, వేలాది జీవుల మరణానికి కారణమవుతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఎకరాలలో నేల కలుషితమై తన సారాన్ని కోల్పోయి ఎడారులుగా మారిపోతుంది. సకల జీవరాశులకు జీవం పోసే నేల తన జీవాన్ని కోల్పోయి నిస్సారంగా మారితే సృష్టిలోని సకల జీవరాశుల మనుగడ ఒక పెను సంక్షోభంలో పడుతుంది. ఈ సంక్షోభాన్ని అరికడితేనే మానవ మనుగడ కూడా సాధ్యమవుతుంది, లేకుంటే వినాశనమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News