తెలంగాణ రాష్ట్రంలో ఓ పక్క విజయోత్సవాలు, మరోపక్క అరెస్టులు..ఇంకో పక్క నిరసన సభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనికి కౌంటర్‌గా బీజేపీ ఇప్పటికే కాంగ్రెస్ 6 హామీలు, 66 అబద్దాలు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 7న హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ స్టేడియం లో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ నిరసన సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఈ నిరసన సభకు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నట్లు ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సభను విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీ పై ఉన్న వ్యతిరేకతను రాష్ట్ర ప్రజలకు చాటేందుకు బీజేపీ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నగరంలో గత కొంత కాలంగా హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా హైడ్రా, మూసీ బాధితులను పెద్ద ఎత్తున బీజేపీ సభకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం అందుతోంది.