హైదరాబాద్: డార్లింగ్ ప్రభాస్, హీరోయిన్ నయనతారతో మళ్లీ ఒకసారి నటించనున్నట్టు సమాచారం. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు తోడుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాను టిజి విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రత్యేక మాస్ పాట ఉన్నట్టు సమాచారం. ఈ పాట కోసం నయనతారను తీసుకోనున్నట్టు సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
దీంతో ప్రభాస్ మళ్లీ ఒకసారి నయనతారతో ఆడిపాడనుండడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. 17 సంవత్సరాల క్రితం యోగి సినిమాలో ప్రభాస్‌తో నయనతార నటించారు. స్పెషల్ సాంగ్ కోసం నయనతార ఒప్పుకుంటే మళ్లీ ఇద్దరు కలిసి నటించనున్నారు. రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ డబుల్ యాక్షన్ రోల్ లో నటించనున్నట్టు సమాచారం. తొలి సాంగ్ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 2025 ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది.