వర్ధంతి నాడు విగ్రహం
వద్ద గేట్లు తెరవని కాంగ్రెస్
ప్రభుత్వం భారీ
విగ్రహానికి అవమానం
బిఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నగరం నడిబొడ్డున కెసిఆర్ ఏర్పాటు చేశారని, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు. తమ మీద అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయున్ని నిర్భంధించి,అవమానిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిర్బంధిస్తున్నది బిఆర్‌ఎస్ నేతలను కాదు అని, అంబేద్కర్‌ను అని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్ పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. దళితబంధు తొలగించి అంబేద్కర్ అభయహస్తం తెస్తామన్నారని, కానీ ఇప్పటివరకు దాని అమలు ఊసేలేదని విమర్శించారు. దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారిపై దండిగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా కాంగ్రెస్ నేతలు అంబేద్కర్‌కు ఇచ్చే నివాళి..?అని ప్రశ్నించారు. వందల మంది పోలీసులను పెట్టి తమ పార్టీ నేతలను నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు.
ఇందిరాగాంధీ భరతమాత విగ్రహాలు ఏర్పాటు చేస్తే తర్వాత మార్చారా..?
గురుకులాల్లో 48 మంది విద్యార్థులు చనిపోయారని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల విద్యార్థులను తాము ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిస్తే.. కాంగ్రెస్ సర్కార్ పాడె ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ గురుకుల బాటను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని అడ్డుకుంటే సిఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడుతారని,అయితే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, నేతలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. రాహుల్ గాంధీ చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ అక్కడికి వెళ్లొద్దా..? అని అడిగారని, కానీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి లగచర్లకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని రాహుల్‌గాంధీని కెటిఆర్ ప్రశ్నించారు. నిజంగానే రాహుల్‌గాంధీకి రాజ్యాంగంపై ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు గుర్తించి, కాంగ్రెస్ సిఎంకు జ్ఞానోదయం చేయాలంటూ సూచించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతామని చెప్పారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేది అని, కావాలని అడుక్కుంటే రాదని ఎద్దేవా చేశారు. కనీసం నెల రోజులు సమావేశాలు నిర్వహించాలని అన్నారు. సచివాలయంలో రేవంత్ రెడ్డి ప్రతిష్టిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా లేదా కాంగ్రెస్ తల్లి విగ్రహమా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా లోగోలు, నంబర్ ప్లేట్లు మారాలా..? అని ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో సబ్బండ వర్గాలు, కవులు, కళాకారులు, మేధావులు అంతా కలిసి తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా సంస్కృతికి అనుగుణంగా కెసిఆర్ తెలంగాణ తల్లికి రూపం ఇచ్చారని గుర్తు చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్భంధాలను దాటుకుని ఒక దేవతను ఊరేగించినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహ స్థాపన చేశామని అన్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ మారుస్తానని, తెలంగాణ చరిత్రను మారుస్తానని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టారని విమర్శించారు. ఉద్యమ సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నారని చెప్పారు. నాలుగేండ్ల తర్వాత ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలో.. ఎక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలో అక్కడికి పంపిస్తామన్నారు. గతంలో ఇందిరాగాంధీ భరతమాత విగ్రహాలు ఏర్పాటు చేస్తే తర్వాతి ప్రభుత్వాలు విగ్రహాలు మార్చాయా..? అని ప్రశ్నించారు.