Monday, January 13, 2025

ఎసిబికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా, కల్హేర్ పంచాయతీ కార్యదర్శి సి.ఉమేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండలం, మహదేవ్‌పల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. మహాదేవ్‌పల్లి -గ్రామానికి చెందిన బాధితుడు టీస్టాల్ ఏర్పాటు కోసం సుమారు నెల రోజుల నుంచి నోఅబ్జక్షన్ (నోడ్యూస్) సర్టిఫికేట్ కోసం పంచాయతీ కార్యదర్శి ఉమేష్‌ను సంప్రదిస్తున్నాడు. అయినా రేపు, మాపని దాటవేయడంతో పాటు వేలాది రూపాయలను డిమాండ్ చేసి చివరికి రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

బాధితుడు చేసేదేమీలేక ఒప్పుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. ఎసిబి అధికారుల సూచనల ప్రకారం శుక్రవారం పంచాయతీ కార్యదర్శి ఉమేష్ బాధితుడి నుంచి రూ.15 వేల లంచం డబ్బులను తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అనంతరం పంచాయతీ కార్యదర్శిని ఎసిబి సుమారు 4 గంటల పాటు విచారించి, కేసు నమోదు చేశారు. కల్హేర్ ఎంపిడిఒ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగింది. ఇదిలావుండగా, ఎసిబి అధికారి అనంత్‌కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరైనా లంచం అడిగినట్లైతే టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారు పేరును గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News