ఆలస్యంగా వచ్చినందుకు మందలించారనే ఆగ్రహంతో 12వ తరగతి విద్యార్థి ఒకడు శుక్రవారం మధ్యాహ్నం మధ్య ప్రదేశ్ ఛత్తర్‌పూర్ జిల్లాలో తమ పాఠశాల ప్రిన్సిపాల్‌ను కాల్చి చంపినట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు. ఆర్ట్స్ తరగతి విద్యార్థులైన అతను, అతని సహచరుడు ఆ తరువాత హతుని స్కూటర్‌పై అక్కడి నుంచి పారిపోయారని వారు తెలిపారు. ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాయిలెట్ ఎంట్రన్స్‌లో ప్రిన్సిపాల్ ఎస్‌కె సక్సేనా (55)ను మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు తలపై కాల్పులు జరిపినట్లు జిల్లా ఎస్‌పి ఆగమ్ జైన్ తెలియజేశారు.
‘సక్సేనా అక్కడికక్కడే మరణించారు. కాల్పులు జరిపిన దుండగీడు, అతని సహచరుడు హతుని స్కూటర్‌పై పారిపోయారు. ఆ ఇద్దరు విద్యార్థును పట్టుకొనడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి’ అని జైన్ చెప్పారు. దేశవాళీ పిస్తోల్ నుంచి ఒక తూటా మాత్రమే పేల్చినట్లు, పిస్తోల్‌ను ఇంకా స్వాధీనం చేసుకోవలసి ఉన్నట్లు నగర ఎస్‌పి అమన్ మిశ్రా ‘పిటిఐ’తో చెప్పారు. హతుని ఎక్స్‌రే నివేదికలు అందిన తరువాత మరిన్ని వివరాలు తెలియగలవని ఆయన చెప్పారు. ‘ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, గతంలోను, శుక్రవారమూ ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపాల్ మందలించినందుకు ఇద్దరు నిందితులూ ఆగ్రహించారు’ అని మిశ్రా తెలిపారు. ఆయన హత్య ప్రదేశంలో దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్నారు.