ఆస్ట్రేలియాతో శుక్రవారం ఆరంభమైన పింక్‌బాల్ (డేనైట్) టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే కుప్పకూలింది. బోర్డర్గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి రోజే మ్యాచ్‌పై పట్టు సాధించింది. భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కంగారూలు సఫలమయ్యారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే మరో 94 పరుగులు చేయాలి.
శనివారం రెండో రోజు ఆట ఆరంభంలోనే భారత బౌలర్లు సాధ్యమైనన్ని వికెట్లు పడగొడితే మాత్రం కంగారూలకు ఇబ్బందులు ఖాయం. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 13 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 24 పరుగులు మాత్రమే.అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్ నాథన్ మెక్స్వినీ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జట్టు స్కోరును 86 పరుగులకు చేర్చారు. ఆట ముగిసే సమయానికి స్వినీ (38), లబుషేన్ (20) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆరంభంలోనే..
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఇన్నింగ్స్ తొలి బంతికే షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ మిఛెల్ స్టార్క్ అద్భుత బంతితో యశస్విని ఎల్బీగా వెనక్కి పంపాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్‌తో కలిసి మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచేందుకు ప్రయత్నించాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. రాహుల్, గిల్ సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్లను ఒత్తిడికి గురి చేశారు.
స్టార్క్ జోరు..
అయితే అంత సాఫీగా సాగుతున్న సమయంలో స్టార్క్ మరోసారి భారత్‌ను దెబ్బతీశాడు. కుదురుగా ఆడుతున్న రాహుల్‌ను స్టార్క్ ఔట్ చేశాడు. రాహుల్ 6 ఫోర్లతో 37 పరుగులు సాధించాడు. ఆ వెంటనే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కూడా స్టార్క్ వెనక్కి పంపాడు. కోహ్లి ఏడు పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. మరోవైపు ఐదు ఫోర్లతో 31 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్‌ను బొలాండ్ పెవిలియన్ బాట పట్టించాడు. అంతేగాక కెప్టెన్ రోహిత్ శర్మ (3)ను కూడా బొలాండ్ కంగుతినిపించాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (21)ను ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ఔట్ చేశాడు.
మరోవైపు నితీష్ రెడ్డి ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న నితీష్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్ 3 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా, బుమ్రా ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 44.1 ఓవర్లలో 180 పరుగుల వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 48 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. కమిన్స్, బొలాండ్లకు రెండేసి వికెట్లు లభించాయి. కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 10 ఆధిక్యంలో కొనసాగుతోంది.