Thursday, December 12, 2024

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా

- Advertisement -
- Advertisement -

మహాకుంభ్ 2025ని భారత సాంస్కృతిక ఐక్యతకు ప్రపంచ చిహ్నంగా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటోంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సారథ్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం భారీ రోడ్‌షో జరిగింది. రోడ్‌షో అనంతరం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శంగా నిలిచే ఓ అద్భుతమైన వేడుకగా మహాకుంభ్’ను అభివర్ణించారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్- 2025లో పాల్గొనాలని తెలంగాణ ప్రజలను ఆహ్వానించారు. అంతర్జాతీయ భాగస్వామ్యం, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ కార్యక్రమం చారిత్రాత్మకంగా నిలిచిపోయేందుకు ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపడుతోందని తెలిపారు.

మహాకుంభ్ భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగి ఉందన్నారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభ్- 2025కు 45 కోట్ల మందికి పైగా యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులను ఆహ్వానించే అవకాశం ఉందని, ఇందుకోసమని సన్నాహక ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేసింన్నారు. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం పవిత్ర ఒడ్డున మహాకుంభ్ జరుగుతుందని, మానవాళికి అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వంగా యునెస్కో గుర్తించిన మహాకుంభ్ 12 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి పవిత్ర భూమి ప్రయాగలో జరుగుతోందని తెలిపారు.

స్వచ్ఛ, శుభ్రత, సురక్షిత,హరిత మహాకుంభ్ : ఇది పరిశుభ్రమైన, ఆరోగ్యకర, సురక్షిత, డిజిటల్ మహాకుంభ్ అవుతుందని, ప్లాస్టిక్ రహిత మహకుంభ్ గా ప్రకటించడం ద్వారా పర్యావరణహిత కార్యక్రమంగా దీనిని మార్చాలని ప్రతిన పూనామని, ఇందులో భాగంగా మేళా ప్రాంతంలో వివిధ డోన-పట్టాల విక్రయదారులకు దుకాణాల ఏర్పాటుకు అవకాశం కల్పించామన్నారు. పరిశుభ్రతపై చర్చించడానికి 400 పాఠశాలల ప్రిన్సిపాళ్ళతో సమావేశాలు జరిపామని, 4 లక్షల మంది పిల్లలకు స్వచ్ఛ మహకుంభంపై సమాచారం ఇచ్చామన్నారు. ప్రయాగ్‌రాజ్ జనాభా కంటే ఇది 5 రెట్లు ఎక్కువ అని, అలాగే హర్ ఘర్ దస్తక్ ప్రచారం కింద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత పర్యావరణం అనే సందేశాన్ని ప్రతి ఇంటికి పంపిస్తామని ఆయన చెప్పారు. మహాకుంభమేళా 2025ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు.

సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలు : ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ మహాకుంభమేళాకు సన్నాహాలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. యాత్రికులు, సాధువులు, మహాకుంభ్ లో కల్పవాస్‌ని చూసే వారు, పర్యాటకులకు ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లు చేయడం లాంటివి ఇందులో ఉన్నాయన్నారు. పెద్ద సంఖ్యలో స్పెషలిస్టు వైద్యులను అందుబాటులో ఉంచారు. పరేడ్ గ్రౌండ్ వద్ద 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 20 పడకలతో మరో రెండు ఆసుపత్రులు, 8 పడకల చిన్న ఆసుపత్రులను కూడా సిద్ధం చేశారు. మేళా ప్రాంతం, ఆరైల్ వద్ద రెండు 10 పడకల ఐసీయూలను ఆర్మీ హాస్పిటల్ ఏర్పాటు చేసింది. ఈ ఆసుపత్రుల్లో 24 గంటలూ వైద్యులు విధులు నిర్వహిస్తారు. మొత్తం 291 మంది ఎంబీబీఎస్ వైద్యులు, స్పెషలిస్టులు, 90 మంది ఆయుర్వేద, యునాని నిపుణులు, 182 మంది నర్సింగ్ సిబ్బంది ఉంటారు. అంతేకాదు ఈ ఆసుపత్రుల్లో పురుషులు, స్త్రీలు, పిల్లలకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. డెలివరీ గదులు, అత్యవసర వార్డులు, వైద్యుల గదులు కూడా అందుబాటులో ఉంటాయి.

భక్తులకు డిజిటల్ మహాకుంభ్ అనుభూతి : దైవిక, గొప్ప, డిజిటల్ మహా కుంభ్ నిర్వహించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రత్యేక వెబ్‌సైట్, యాప్‌ను ప్రారంభించడం, 11 భాషల్లో ఏఐ -ఆధారిత చాట్‌బాట్, వ్యక్తులు వాహనాల కోసం క్యూర్ ఆధారిత పాస్‌లు, బహుభాషా డిజిటల్ లాస్ట్-అండ్-ఫౌండ్ సెంటర్, పరిశుభ్రత, గుడారాల కోసం ఐసిటి పర్యవేక్షణ, స్థలం, సదుపాయాల కేటాయింపు కోసం సాఫ్ట్‌వేర్, బహుభాషా డిజిటల్ సంకేతాలు, ఆటోమేటెడ్ రేషన్ సరఫరా వ్యవస్థ, డ్రోన్ ఆధారిత నిఘా, విపత్తు నిర్వహణ, 530 ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం లైవ్ సాఫ్ట్‌వేర్, ఇన్వెంటరీ ట్రాకింగ్ సిస్టమ్, గూగుల్ మ్యాప్స్ ద్వారా అన్ని ప్రాంతాల అనుసంధానం వంటి సన్నాహాలను ప్రభుత్వం చేసిందన్నారు. పర్యాటకులకు పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇందుకోసం 101 స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారని, వీటిల్లో రోజుకు ఐదు లక్షల వరకు వాహనాలను నిలిపే వీలుంటుందన్నారు. పార్కింగ్ ప్రాంతం 1,867.04 హెక్టార్లలో విస్తరించి ఉందని, ఇది 2019లో పార్కింగ్ కోసం కేటాయించిన 1,103.29 హెక్టార్లతో పోలిస్తే 763.75 హెక్టార్లు ఎక్కువని, ఈ పార్కింగ్ సౌకర్యాలను అనుసంధానిత కంట్రోల్ కమాండ్ కేంద్రం ద్వారా పర్యవేక్షిస్తారన్నారు.

44 ఘాట్లలో పూల జల్లుల కోసం ఏర్పాట్లు : మహకుంభ్ నగరంలో భక్తులు స్నానాలు ఆచరించేందుకు వీలుగా ప్రస్తుతం 35 శాశ్వత ఘాట్‌లు, 9 కొత్త ఘాట్‌లను నిర్మించినట్లు తెలిపారు. 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మొత్తం 44 ఘాట్లలో ఏరియల్ ఫ్లవర్ షవర్స్ ఉంటాయని, ముంబైలోని మెరైన్ డ్రైవ్ తరహాలో రివర్ ఫ్రంట్‌ను గంగానది ఒడ్డున సంగం నుంచి నాగవాసుకి టెంపుల్ వరకు, సుర్దాస్ నుంచి ఛత్నాగ్ వరకు, కర్జన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మహావీర్ పూరి వరకు 15.25 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. అదనంగా రద్దీ నిర్వహణను మెరుగు పరచడానికి అనుసంధానిత కంట్రోల్ కమాండ్ సెంటర్‌ను నవీకరించారని, ఎప్పటికప్పుడు సీసీటీవీ ద్వారా పర్యవేక్షణ కోసం 52- సీటర్ సెటప్‌లతో నాలుగు వీక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

మహాకుంభ్ కు హాజరయ్యే యాత్రికుల సంఖ్య లెక్కింపు సాంకేతికత పద్ధతిలో జరుగుతుందని, ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్- 2025కి సుమారు 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రపంచ వేదికపై మహాకుంభ్ మతపరమైన కార్యక్రమానికి సంబంధించి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాంప్రదాయ, పౌరాణిక విశేషాలను అపురూపంగా ప్రదర్శిస్తోందని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఉద్ఘాటించారు. సనాతన భారతీయుల గొప్ప పండుగ అయిన మహాకుంభ్- 2025 కోసం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు, ప్రపంచం మొత్తానికి ఉత్తరప్రదశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలను అందచేస్తోందని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News