నాలుగేండ్లు అమెరికాను శాసించిన కురువృద్ధ రాజకీయ నాయకుడు జో బైడెన్ జనవరిలో శ్వేతసౌధం నుంచి నిష్క్రమించబోతూ ప్రపంచాన్ని సంకటస్థితిలోకి నెట్టారు. ఉక్రెయిన్‌ను ఉసిగొల్పి రష్యాపై ఊహించని రీతిలో దాడులకు ప్రేరేపించారు. ఇప్పటికే అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తూ రష్యాను అడ్డుకునే సాహసం చేస్తున్నాయి. భారత్ లాంటి దేశాల సహకారంతో యుద్ధం పరిసమాప్తి కాబోతున్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో నింగి విరిగి నేల మీదపడ్డ చందంగా రష్యాపై ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిస్సైళ్లను కురిపించి అతి పెద్ద సాహసానికే ఒడిగట్టిందనే చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్‌కార్డు పడుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్న సందర్భంలో జో బైడెన్ రష్యాపట్ల ఇంతగా అక్కసును వెళ్లగ్రక్కుతూ ఉక్రెయిన్‌కు ఊతమిస్తూ, రష్యాపై తీవ్రమైన దాడులకు ప్రేరేపించడం బాధ్యతారాహిత్యం.
రాజనీతిజ్ఞుడిగా పేరొందిన బైడెన్ ఇలాంటి యుద్ధోన్మాద చర్యలకు ప్రోత్సాహమివ్వడం సముచితం కాదు. అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారిన ఉక్రెయిన్ రాబోవు విపత్కర పరిణామాలను గమనించకుండా రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించి రష్యా అహాన్ని దెబ్బతీసింది. దెబ్బతిన్న బెబ్బులిలా రెచ్చిపోయిన రష్యా ఉక్రెయిన్‌పై ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. పైగా రష్యా తన అణ్వస్త్ర విధానంలో కూడా మార్పులు చేసింది. తమ దేశానికి వ్యతిరేకంగా ఏ దేశమైనా అణ్వయుధాలు అందచేస్తే తాను అణ్వాయుధాలను ప్రయోగిస్తానని నిర్ద్వంద్వంగా ప్రకటించింది. ఇప్పటి వరకు రష్యా- ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం వలన ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం మాత్రమే ఏర్పడింది. ఈ ఆర్థిక మాంద్య నుండి పలు దేశాలు నెమ్మదిగా కోలుకుంటున్న దశలో అమెరికా ధోరణి రష్యా ఆగ్రహానికి కారణమైనది.
ఉక్రెయిన్ క్షిపణి దాడులు రష్యాను అణుయుద్ధానికి ఉసిగొల్పింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హీరోషిమా, నాగసాకి నగరాలపై ప్రయోగించిన అణు బాంబుల వలన జరిగిన విధ్వంసాన్ని తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరించక మానదు. 80 సంవత్సరాల క్రితం జరిగిన నాటి సంఘటన చరిత్రలో ఒక భయానకమైన సంఘటనా మిగిలిపోయింది. రష్యా- ఉక్రెయిన్ల మధ్య వెయ్యి రోజులుగా సాగిన సుదీర్ఘ యుద్ధం పరిసమాప్తం కాబోతున్నదని ఊహించి, ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచానికి తాజా అణు యుద్ధ ప్రకటనలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ప్రయోగంపై మండిపడ్డ రష్యా ఉక్రెయిన్‌పై ఐసిబియమ్ ప్రయోగించడం ఇరు దేశాల మధ్య రగులుతున్న రావణ కాష్ఠానికి పరాకాష్ఠగా పేర్కొనవచ్చు.రష్యా ఉక్రెయిన్‌పై అణుయుద్ధానికి దిగితే ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయి రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కాస్తా అమెరికా, రష్యాల మధ్య యుద్ధంగా రూపాంతరం చెందుతుంది.
తద్వారా మూడవ ప్రపంచ యుద్ధం కూడా సంభవించే అవకాశం కూడా ఉంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్‌ను ఇరుకున పెట్టడానికి జో బైడెన్ పన్నిన వ్యూహ ఫలితమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతూ, ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చే పరిస్థితులను కల్పించడం రాజనీతిజ్ఞత అనిపించుకోదు. ఇప్పటికే అమెరికా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చుతూ, మోయలేనంత అపకీర్తిని మూటగట్టుకుని ప్రపంచ ప్రజల దృష్టిలో తన స్థానాన్ని, గౌరవాన్ని దిగజార్చుకుంది.
ఇప్పటికే ఇజ్రాయిల్- గాజా, ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే, రష్యా- ఉక్రెయిన్ల మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం బైడెన్ వలన కొత్త రూపం సంతరించుకుంది. అణ్వస్త్ర సామర్ధ్యం లేని ఉక్రెయిన్‌కు అణ్వయుధాలను, అత్యంత శక్తివంతమైన ఆయుధాలను అందించడం ద్వారా బలమైన ఆయుధ అణ్వస్త్ర సామర్ధ్యం గల రష్యాను ఓడించాలని అమెరికా వ్యూహాలు పన్నడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులను కల్పిస్తున్నది. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాన్ని సజీవంగా ఉంచడానికి అమెరికా ప్రయత్నాలు చేయడం క్షమార్హం కాదు. ప్రజలు మెచ్చే చర్య కాబోదు. శాంతికాముక దేశాలు సైతం రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి భీతిల్లుతున్నాయి.