హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్ డిసి) ఛైర్మన్ గా ఆయన్ని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో దిల్ రాజు రెండు ఏళ్లు ఉండనున్నారు.
దిల్ రాజు అసలు పేరు వెంకట రమణా రెడ్డి. 1990లో ‘ పెళ్లి పందిరి’ సినిమాతో పంపిణీదారుడిగా అరంగేట్రం చేశారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతగా కొనసాగుతున్నారు. 2003లో నిర్మాతగా ‘దిల్’ సినిమా తీశారు. ఆ చిత్రం విజయం సాధించడంతో తన పేరును ‘దిల్ రాజు’గా చెలామణి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా నిర్మిస్తున్నారు. అది జనవరి 10 న విడుదల కానున్నది. ఇక విక్టరీ వెంకటేశ్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా తీస్తున్నారు. ఆ సినిమా జనవరి 14న విడుదల కానున్నది. ‘తమ్ముడు’ అనే మరో సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.