ముంబై: నటుడు అమోల్ పాలేకర్ తన కెరీర్ లోని చేదు అనుభవాల గురించి వివరించారు. నిజానికి ఆయన మన పొరిగింటి వ్యక్తి అనేంత సామాన్యంగా ఉంటాడు. ప్రముఖ నటుడు రాజేశ్ ఖన్నాతో నటించినప్పటి విషయాల గురించి అమోల్ పాలేకర్ వివరించారు. రాజేశ్ ఖన్నా చిత్ర పరిశ్రమలో ఎంతో ఉన్నత స్థాయి నుంచి కిందికి దిగజారారన్నారు. కొన్ని దశాబ్దాలపాటు ఆయన హిందీ సినీ జగత్తును డామినేట్ చేశారన్నారు. ఆయన తన భార్య డింపుల్ కపాడియా తో కూడా సరిగా ఇమడలేకపోయారన్నారు.
అమోల్ పాలేకర్ ‘ది లల్లన్ టాప్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘ నేను రాజేశ్ ఖన్నాతో కలిసి పనిచేశాను. ఆయన ఓ సూపర్ స్టార్. కానీ ఆయన తన తోటి నటులను తక్కువ చేసి ఉండకూడదు. మన చిత్రపరిశ్రమలో ఆయన సూపర్ స్టారే కావొచ్చు. కానీ పద్ధతి ప్రకారం ఉండాల్సింది ’’ అన్నారు.
‘‘ మా సీన్లలో నాకు మాట్లాడేందుకు మాటలే ఉండేవి కావు. అయినా నేను నోరు మెదపలేదు. అయినప్పటికీ ఆయన ప్రపంచానికి నాకంటే తాను సుపీరియర్ నని చూపించాలనుకున్నారు. అప్పుడు నేను ఒక్కటే అనుకున్నాను. ఈ తలపొగరు నాకు ఎక్క కూడదని. ఎవరితో కూడా నేను అలా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నాను. కొందరు నటులు తమ పని, టైమ్ అయిపోయిందని భావించినప్పుడు ఇలాంటి ఇన్సెక్యూరిటీకే లోనవుతుంటారు’’ అన్నారు. రాజేశ్ ఖన్నా ఓ సినిమాలో తనని తన్నిన సంగతి కూడా అమోల్ పాలేకర్ వివరించారు. అప్పట్లో చాలా మంది ఇతర నటులు రాజేశ్ ఖన్నా తలపొగరు, ఇతరులను తక్కువ చేసే మాటల గురించి చెప్పేవారని అమోల్ పాలేకర్ వివరించారు. ఆయన తన సహనటుడు అమితాబ్ బచ్చన్ మీద కూడా వ్యాఖ్యలు చేసేవాడని అన్నారు. ఏది ఎలావున్నప్పటికీ రాజేశ్ ఖన్నా 2012లో చనిపోయారు.