ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మహా వికాస్ అఘాడీలో పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి శివసేన(యూబీటీ) నేత ఒకరు చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ సశమాజ్‌వాదీ పార్టీ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. అసలేం జరిగిందంటే, బాబ్రీ మసీదు కూల్చివేతపై శివసేన (యూబీటీ) ఎమ్‌ఎల్‌సీ మిలింద్ సర్వేకర్ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేశారు. ‘ఈ పని చేసిన వారి పట్ల నేను గర్వంగా ఉన్నా’ అని శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే చేసిన వ్యాఖ్యలను రాసుకొచ్చారు. అటు ఓ వార్తా పత్రిక లోనూ దీనిపై ప్రకటన ఇచ్చారు. ఈ పరిణామాలపై సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) ఆగ్రహం వ్యక్త చేసింది.
“ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీకి వారికి తేడా ఏముంది?.. మేం ఇంకా ఎందుకు వారితో కలిసి ఉండాలి? మహా వికాస్ అఘాడీ నుంచి మేం వైదొలగుతున్నాం. ఇదే విషయాన్ని పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లాం” అని ఎస్పీ మహారాష్ట్ర చీఫ్ అబుఅజ్మీ వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ ఎంవీకే కూటమితో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రెండు అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఎస్పీ ప్రకటనపై శివసేన (యూబీటీ) ఇంకా స్పందించలేదు.