బిజాపూర్: ఛత్తీస్‌గఢ్ బిజాపూర్ జిల్లాలో పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో ఒక మహిళా అంగన్‌వాడి అసిస్టెంట్‌ను నక్సలైట్లు హత్య చేశారని శనివారం ఒక అధికారి వెల్లడించారు. బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఆ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, గుర్తు తెలియని కొందరు నక్సలైట్లు గ్రామంలోని లక్ష్మీ పడ్(45) ఇంటిలోకి దూసుకువచ్చి, ఆమె కుటుంబం ఎదుటే ఆమె గొంతు నులిమి చంపారని, వారు ఇంటి పెరట్లో మృతదేహాన్ని పడవేసి, పారిపోయారని పోలీస్ అధికారి వివరించారు.
ఆ ఘటన గురించి సమాచారం అందగానే ఒక పోలీస్ బృందం హుటాహుటిని అక్కడికి చేరుకుందని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపిందని ఆయన తెలిపారు. మావోయిస్టుల మాడ్డెడ్ ఏరియా కమిటీ జారీ చేసిన ఒక కరపత్రం ఆ ప్రదేశంలో కనిపించిందని, ఆ మహిళ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తోందని వారు ఆరోపించారని ఆయన తెలియజేశారు. దుండగుల ఆచూకీ తీయడానికి ఆ ప్రాంతంలో గాలింపు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.