Thursday, December 12, 2024

విద్యా భోదన ఎలా ఉండాలంటే..!

- Advertisement -
- Advertisement -

తరగతి గదిలో పాఠాలు చెప్పడమంటే… ఒక తరం తలరాతను రాయడం. ఒక దేశం భవితకు పునాది వేయడం. చిన్నారుల చెయ్యి పుచ్చుకొని విజ్ఞాన వనంలో విహరింపజేయడం, మంచేదో చెడేదో చెబుతూ విద్యార్థుల వ్యక్తిత్వానికి విలువల వన్నెలద్దడం గురువులు చేసే పని. అలాంటి గురువులందరూ భారతీయ సంస్కృతి లో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలయ్యారు. ‘ఆచార్య దేవోభవ’ అన్న మాటకు అర్థం చెబుతూ బడి పిల్లలను సొంత బిడ్డలుగా చూసుకునే ఉపాధ్యాయులు నేటికీ కోకొల్లలు. పేద కుటుంబాల చిన్నారులకు ఫీజులు కట్టి పుస్తకాలు కొనిచ్చే మాస్టార్లు, వ్యక్తిగత శ్రద్ధతో వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థులను సానపట్టే టీచర్లూ గణనీయంగానే ఉన్నారు. సమాజంలోని కుళ్లంతా పసిపిల్లల మెదళ్లలోకి చొరపడకుండా జాగ్రత్తగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులతో విద్యార్థుల భవిష్యత్తు ఆశాజనకంగా మారుతుంది.
సమానత్వం, లౌకికవాదం వంటి రాజ్యాంగ విలువల గురించి చెబుతూ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిందీ వారే. ఆరోగ్యకరంగా, గౌరవప్రదంగా, స్వేచ్ఛగా ఎదిగేందుకు చిన్నారులకు అన్ని అవకాశాలూ, సదుపాయాలూ కల్పించాల్సింది రాజ్యమేనని 39(ఎఫ్) రాజ్యాంగ అధికరణ స్పష్టంగా చెబుతోంది. ఇందుకు అనుగుణంగా సర్కారు బడుల్లో పిల్లలకు అటువంటి సురక్షిత వాతావరణం కల్పించవలసింది ఉపాధ్యాయులు. ఓర్పుగా నేర్పుతో పాఠాలను పిల్లలకు కరతలామలకం చేయడం ఉపాధ్యాయుల విధ్యుక్తధర్మం. చిన్నారులపై శారీరక, మానసిక వేధింపులు లేకుండా అర్థమయ్యేలా బోధన సాగాలి. ఇందుకు ఒక్కో ఉపాధ్యాయుడిది ఒక్కో శైలిలో బోధన ఉంటుంది. ఆ శైలి విద్యార్థులకు అర్ధమయ్యేలా ఉండాలి.

శరవేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పాఠశాలల స్వరూపం, ఉపాధ్యాయుల బోధన తీరును సంస్కరించవలసిన అవసరముంది. ప్రస్తుత విద్యావ్యవస్థ విద్యార్థులను ఏళ్ల తరబడి ఓ మూస విధానంలో నడిపిస్తూ అందరినీ ఒకే తరహాలో ఉండే నమూనాలుగా తయారు చేస్తోంది. తరగతి గది అనేది విద్యార్థులు ఏం నేర్చుకోవాలో బోధించేది కాదు. తమంతట తాము తెలుసుకోవానికి ప్రోత్సహిస్తూ తమ ఆసక్తులను గుర్తెరిగి వాటిని ఎలా పెంపొందించుకోవాలో తెలియజేసే మార్గదర్శిలా ఉండాలి. ఈ మేరకు జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినట్లుగా విద్యా సంస్కరణలు జరగాలి. పిల్లల మానసిక వికాసం పెంపొందించేలా మూడేళ్లలోపు చిన్నారుల విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. ప్రాథమిక స్థాయి తరగతుల బోధన ప్రధానంగా చదవడం, రాయడంపైన ఉంటుంది. పరిశీలన, అవగాహన, సృజనాత్మకత, ఆలోచనాత్మకత వంటి విషయాలు చదవడం, రాయడం ద్వారా అబ్బుతుంది. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధానంగా దోహదపడుతారు.
తరగతి గదిలో లేదా ఇంటి వద్ద తగినన్ని కథల పుస్తకాలు, పోస్టర్లు, మ్యాగజైన్లు, వార్తా పత్రికలు, న్యూస్ లెటర్లు, బొమ్మలతో కూడిన వ్యాఖ్యానాలు, వివిధ విషయాలు తెలియపరిచే కరపత్రాల వంటి సామాగ్రి ద్వారా చదుకోవాలనే వాతావరణం కల్పించడం ఎంతో అవసరం. ఇది కాస్త అనుభవాత్మక అభ్యసన వైపు మళ్ళిస్తుంది. వినడం, మాట్లాడం, చదవడం, రాయడం ప్రధానాంశంగా ప్రాథమిక విద్యా ప్రామాణికల పట్టికలో చేర్చిన విషయం తెలిసిందే. పిల్లల అభ్యసనా ప్రక్రియలో తల్లిదండ్రుల పాత్ర ప్రధానమైనది. ఇంటి వద్ద పిల్లల ప్రగతి, వారి చదువు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుకు అవసరమయ్యే సామాగ్రి, అనువైన వాతావరణం కల్పించాలి. విద్య వైపు దృష్టి మరల్చడానికి అవసరమయ్యే అధిక పరిజ్ఞానాన్ని అందివ్వడానికి తోడ్పడాలి.

మెదడు, మేధస్సుకు సంబంధించిన విద్యను పిల్లలకు అందివ్వడంలో అతి జాగరూకతతో వ్యవహరించాలి. మేధస్సు పెరిగి, అవగాహన పెంపొందించేందుకు వీలుగా చర్యలుండాలి. చిన్నారులు తమ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ, ఎలా ప్రతిస్పందిస్తున్నారనే అంశాన్ని అధ్యయనం చేయాలి. ఈ సామర్థ్యం పెంపొందేలా విద్య ఉండాలి. ముఖ్యంగా దృశ్య శ్రవణ మాధ్యమాలకు స్పందన ఎలా ఉందనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. రంగులను గుర్తించడం, వివిధ ఆకృతులను పసిగట్టడంలో ప్రతిస్పందించే తీరును గమనించాలి. ఇందుకు అనువైన వాతావరణం, బోధన ఉండాలి. తక్కువ ఖర్చులో దొరికే ‘లెర్నింగ్ ఎయిడ్స్’ను రూపొందించాలి. వాటిలో ఎక్కువగా పిల్లలు ఆడుకునే రంగుల వస్తువులు, వివిధ ఆకృతుల బిళ్లలు, బొమ్మలు, టోపీలు, పడవలు వంటి వాటిని కాగితాలతో తయారు చేసి చూపాలి.
బోధనలో భాగంగా చాలా మంది ఉపాధ్యాయులు బొమ్మలను ఉపయోగిస్తుంటారు.

పర్యావరణానికి నష్టం కలిగించే పాలిథిన్‌ను పక్కనపెట్టి వస్త్రం, తోలు, కాగితంతో పిల్లల చెంతే ప్రయోగశాలను తలపించే బొమ్మలు రూపొందిస్తుంటారు. డ్రాయింగ్ షీట్స్, న్యూస్ పేపర్లు, కత్తెర ఉపయోగించి ఆకట్టుకునేలా అస్థిపంజరం, ఊపిరితిత్తులు, కిడ్నీ తదితర బోధనోపకరణాలు రూపొందించి, వీటిని పిల్లల ముందు ప్రదర్శిస్తూ పాఠాలు బోధిస్తున్నారు. పర్యావరణ హితంగా రంగురంగుల వస్త్రాలతో కాకి, చిలుక తదితర మరెన్నో బొమ్మలను తయారుచేసి పాఠాలను అర్థవంతంగా చెప్తున్నారు. జంతువులు, పక్షులు, మనుషులు ఇలా రకరకాలైన తోలు బొమ్మలను తయారు చేస్తూ ఆహ్లాదకర వాతావరణంలో పాఠాలు బోధిస్తున్నారు. బెలూన్లు, వాడిపారేసిన వస్తువులతో లోలకం, బారోమీటర్, ధ్వని ప్రసరణ, విద్యుత్ అయస్కాంత తరంగాలను గుర్తించే పరికరాలను ప్రయోగాల కోసం తయారు చేస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. చిన్నపాటి మోటార్, స్విచ్చులు, వైర్, టైర్లు, కబోర్డులు, బ్యాటరీలను ఉపయోగించి రిమోట్ కారును తయారుచేస్తూ ఉత్సాహంగా పాఠాలను జీర్ణించుకుంటున్నారు. ప్రాథమిక విద్య రెండవ దశలో పిల్లలకు వర్ణమాలను నేర్పడం, అంకెలూ రంగులను గుర్తించేలా చూడటం, మాతృభాషలో మాట్లాడించడం ముఖ్యం.

ఆకృతులను సరిపోల్చడం, ధ్వనులను అనుకరించడం, వేరుపరచడం, డ్రాయింగ్, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి పరిచయం చేయడంపై దృష్టి సారించాలి. పజిల్స్ పూరించడం, చుక్కలు కలపడం, కథలు చెప్పడం, గీతాలు వల్లె వేయడం, పద్యాలు చెప్పడం వంటి వాటిపై పిల్లలకు మక్కువ పెంచాలి. చదువు పుస్తకాలకు పరిమితం కాకుండా, ఆటపాటల ద్వారా అక్షర జ్ఞానాన్ని, పరిసరాలపై అవగాహనను ఏర్పరచే ప్రయత్నం జరగాలి. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు నిచ్చెనలా తోడ్పడాలి. అప్పుడే భావితరానికి సరికొత్త ప్రపంచం అందించడానికి వీలవుతుంది. మానవ వనరుల అభివృద్ధిలో ఇదొక సరికొత్త పంథాగా నిలుస్తుంది. మెరుగైన సమాజం ఆవిష్క ృతమవడానికి ఆస్కారమేర్పడుతుంది.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News