పాటియాల: తమ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర డిమాండ్ చేస్తూ రైతుల గ్రూప్ పంజాబ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. వారు ఆదివారం హర్యానాలోకి ప్రవేశించగానే పోలీసులు బారికేడ్లు పెట్టి వారిని అడ్డుకున్నారు. భద్రత బలగాలు కొత్తకొత్త విధానాల ద్వారా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బారికేడ్ పాయింట్ల నుంచి రైతులను చెల్లాచెదరు చేసేందుకు హర్యానా పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఎవరైనా రైతు ఒక్కడే బారికేడ్ పాయింట్ కు చేరుకుంటే పోలీసులు పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. బారికేడ్ పాయింట్ల నుంచి వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు పదేపదే రైతులను హెచ్చరించారు.
భద్రత కోసం పోలీసులు అనేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే మేము కూడా ఏమి తీసిపోము అన్న రీతిలో రైతులు కూడా పూర్తిగా సన్నద్ధం అయి వచ్చారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తమను తాము కాపాడుకోడానికి వారు ముఖానికి గుడ్డలు చుట్టుకున్నారు. అంతేకాక తడిపిన జనపనార సంచులతో బాష్పవాయు గోళాలను ఎదుర్కొనే ప్రయత్నం చేశారు.
శంభు బార్డర్ నుంచి దాదాపు 101 మంది రైతులు ఢిల్లీకి మార్చ్ చేయడం మొదలెట్టారు. వారు అక్కడ క్యాంప్ చేసి ఢిల్లీవైపుకు నడిచే తొలి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడుగడుగున అడ్డుకుంటున్నారు. కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీలను రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మార్గమధ్యంలో ఢిల్లీ మార్చికి రాతపూర్వక అనుమతిని చూపమని పోలీసులు రైతులను కోరుతున్నారు. మార్చికి అనుమతించిన 101 మంది రైతుల జాబితాతో వారు మ్యాచ్ కావడం లేదని పోలీసులు దబాయించారు. ‘‘ ముందు మేము వారిని(రైతులను) గుర్తించాలి. తర్వాతనే వారిని అనుమతిస్తాం. మా వద్ద 101 మంది జాబితా ఉంది, అయితే జాబితాలో ఉన్న వారి పేర్లతో వారు సరిపోలడం లేదు. వారు అసలైన రైతులు కాదు. వారు తమని మేము గుర్తించేలా అనుమతించడం లేదు. వారు గుంపుగా ముందుకు కదులుతున్నారు’’ అని హర్యానాకు చెందిన పోలీసు అధికారి తెలిపారు.
‘‘101 మంది రైతులు, రైతు కూలీల మా ‘జఠ్ఠా’(సమూహం) శంభు బార్డర్ కు చేరుకుంది. మేము ఇప్పటికే జాబితాను జారీ చేశాము. మమ్మల్ని చెక్ చేసినాకే పంపిస్తామని వారు(పోలీసులు) నిర్ణయించుకుంటే మేము వారికి సహకరిస్తాము. మేము క్రమశిక్షణను పాటించేవాళ్లం, పాటిస్తాం. కానీ వారు(పోలీసులు) నేడు ఇంకా ఎక్కువ బాష్ప వాయువు ప్రయోగిస్తున్నారు. అయినా సరే మేము ఎలాంటి త్యాగలకైనా వెనుకాడం. మా సమస్యలకు ప్రధాని వద్దే పరిష్కారం ఉంది. ఆయన మా డిమాండ్లనైనా ఒప్పుకోవాలి, లేదా మమ్మల్ని ఢిల్లీకి మార్చ్ చేయడానికైనా అనుమతించాలి’’ అని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధర్ తెలిపారు.