డమాస్కస్: బషర్ అస్సాద్ ప్రభుత్వాన్ని కూల్చేశాక సిరియా తిరుగుబాటుదారులు సిరియా ప్రధాని ముహమ్మద్ ఘాజీ అల్-జలాలీని ఆయన కార్యాలయం నుంచి బయటికి తెచ్చి ఫోర్ సీజన్స్ హోటల్ కు చేర్చారు. ప్రస్తుతానికైతే అస్సాద్ ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. కానీ ఆయన దేశం వదిలి పారిపోయి ఉంటారని కొందరనుకుంటున్నారు.
సిరియా రాజధాని డమాస్కస్ ఇప్పుడు పూర్తిగా తిరుగుబాటుదారలు చేతిలోకి వెళ్లిపోయింది. సిరియాలో అంతర్యుద్ధం కొనసాగింది. ఆ దేశం ఆర్థికంగా బాగా చితికిపోయింది. లక్షలాది మంది దేశం వదిలి పాశ్చాత్య దేశాలలో, ఇరుగుపొరుగు దేశాలలో శరణు పొందుతున్నారు. ప్రధాని ఘాజీ అల్-జలాలీ తిరుగుబాటు కమాండర్ అబూ ముహమ్మద్ అల్-గోలానీతో కాంటాక్ట్ అయ్యారు. అధికార మార్పిడి గురించి మాట్లాడారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించాలని కోరారు.
ఇదిలావుండగా అమెరికా తూర్పు సిరియాలో తాముంటామని చెబుతోంది. ఐసిస్ ఇస్లామీయ రాజ్యపు ఏర్పాటును అడ్డుకునే చర్యలు తీసుకుంటామంది. రక్షణ శాఖ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ డేనియల్ షాపిరో ఈ విషయాన్ని ఆదివారం తెలిపారు.