టి ఫైబర్ సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
మరిన్ని సేవలతో మీ సేవ మొబైల్ యాప్
రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటింటికి ఇంటర్‌నెట్ సేవలను తక్కువ ధరలకు అందించేందు ఉద్దేశించిన టి ఫైబర్ కనెక్టివిటీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో టి ఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సేవలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా టి ఫైబర్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పలు సంస్థలతో మంత్రి సమక్షంలో ఎంఓయులు జరిగాయి. టి ఫైబర్ ద్వారా మొబైల్, కంప్యూటర్, టివీ వినియోగించుకోవచ్చని మంత్రి చెప్పారు.
టి ఫైబర్ ద్వారా శ్రీరాంపూర్ వాసులతో మంత్రి మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా సంఘంపేట, నారాయణపేట్ జిల్లా మద్దూరు గ్రామాల్లో టీ ఫైబర్ నెట్ సర్వీసులు అందుబాటులో వచ్చాయన్నారు. టీ-ఫైబర్ కోసం కొన్ని ప్రాంతాల్లో అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. అభివృద్ధి కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం కాదని ముఖ్యమంత్రి అన్నారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్యాన్ని కూడా బయటకు తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఉపాధి పెంచే ప్రతి పరిశ్రమ మాకు ముఖ్యమని మంత్రి తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి క ల్పిస్తామన్నారు.
అందుకే కొత్త ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకువచ్చామన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు గత పదేళ్లుగా దాదాపుగా 4 వేల కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వలేదని మంత్రి తెలిపారు. దశల వారిగా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రోగ్రెసివ్ ఐడియాస్ ను ప్రభుత్వంతో పంచుకోవాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. రాష్ట్రంలో ప్రగతిని ఆపాలని విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. వచ్చే నాలుగేళ్ళలో ఇండస్ట్రీస్ లోను నంబర్ వన్ గా నిలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
మరిన్ని సేవలతో మీ సేవా మొబైల్ యాప్
మరిన్ని సేవలతో తయారు చేసిన మీ సేవ మొబైల్ యాప్ ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. మొబైల్ లోనే మీ సేవ సర్వీసులు పొందేలా యాప్ రూపకల్పన చేశారు. మీ సేవలో మరో తొమ్మిది రకాల సర్వీసులను ప్రభుత్వం చేర్చినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్యాప్ సర్టిఫికెట్, సిటిజన్ నేమ్ చేంజ్, లోకల్ సర్టిఫికెట్, మైనారిటీ సర్టిఫికేట్, క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ సీనియర్ సిటిజెన్ మెంటెనెన్స్ వంటి తొమ్మిది రకాల అంశాలను కొత్తగా మీ సేవా మొబైల్ యాప్‌లో చేర్చి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇన్ని రోజులు ఫిజికల్ గా వెళ్లి తీసుకునే అంశాలను ఇక నుంచి మీ సేవ నుంచే పొందే అవకాశం కల్పించామన్నారు. మీ సేవలో కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మరోవైపు రైతులకు రుణమాఫీ, బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ మంత్రి ప్రారంభించారు.
పలు సంస్థల ఒప్పందాలు
రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పలు సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. రూ. 7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థల ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు. లెన్స్ కార్ట్, ఆజాద్ ఇంజనీరింగ్, ప్రీమియర్ ఎనర్జీస్ తదితర సంస్థల ప్రతినిధులతో పరిశ్రమల శాఖ ఎంఓయు చేసుకుంది. మంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. లెన్స్ స్కార్ట్ హైదరాబాద్‌లో ఉత్పత్తులను ప్రారంభించనుంది. సీతారాంపూర్‌లో సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ ఎంఓయూ కుదుర్చుకుంది.
డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వంతో ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని విభాగాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేలా పని చేస్తున్నామని తెలిపారు. జవాబు దారి తనంతో మేమేం చేశామో చెప్పామని, ఏడాదిగా మేమేం చేశాం.. వచ్చే నాలుగేళ్ళు ఏం చేయబోతున్నామో విజయోత్సవాల ద్వారా చెప్తున్నామన్నారు. యాప్ ద్వారా రైతులు త్వరంగా రుణాలను పొందేలా యాప్ తీసుకువచ్చామన్నారు. డ్రగ్స్ నియంత్రణకు విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా మిత్రా యాప్ రూపొందించామని తెలిపారు.