ఆ దేశంలో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదన్న బైడెన్ ప్రభుత్వం
వాషింగ్టన్ : సిరియాలో ప్రతిపక్ష బలగాలు రాజధానిపై ఆధిపత్యం కోసం ముందుకు సాగుతుండగా అక్కడ తీవ్రం అవుతున్న సంఘర్షణకు యుఎస్ మిలిటరీ దూరంగా ఉండాలని అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ శనివారం పిలుపు ఇచ్చారు. ‘ఇది మా పోరాటం కాదు’ అని ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా, ఇరాన్ మద్దతు ఉన్న సిరియా అధ్యక్షుడు బాషర్ అస్సద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు వేగంగా పురోగమిస్తుండడాన్ని ప్రపంచ నేతలు గమనిస్తుండగా, బైడెన్ ప్రభుత్వానికి జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రత సలహాదారుడు జేక్ సులివాన్ స్పష్టం చేశారు.
‘సిరియా అంతర్యుద్ధంలో సైనికపరంగా యునైటెడ్ స్టేట్స్ జోక్యం చేసుకోబోవడం లేదు’ అని సులివాన కాలిఫోర్నియాలో ఒక కార్యక్రమంలో సభికులతో చెప్పారు. సిరియాలో పోరు వల్ల కలుగుతున్న అవకాశాలను వినియోగించుకోకుండా ఇస్లామిక్ స్టేట్‌ను అడ్డుకోవడానికి యుఎస్ అవసరమైన చర్యలు తీసుకుంటుంది అని ఆయన సూచించారు. సిరియా తిరుగుబాటుదారులు క్రితం నెల చివర్లో పురోగమించసాగినప్పటి నుంచి వారి నాటకీయ దూకుడు ధోరణిపై ట్రంప్ మొదటిసారిగా పైవిధంగా వ్యాఖ్యానించారు. అస్సద్ అధికారంలో కొనసాగడానికి అమెరికా దన్నుకు ఆయన అర్హుడు కాడని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.