మార్షల్ లా విధింపు పర్యవసానం
సియోల్ : దక్షిణ కొరియాలో మార్షల్ లా విధించాలని అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు సిఫార్సు చేసినట్లుగా భావిస్తున్న రక్షణ శాఖ మాజీ మంత్రిని దక్షిణ కొరియా ప్రాసిక్యూటర్లు ఆదివారం నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ విధంగా ఆయన ఈ కేసులో నిర్బంధితుడైన తొలి ప్రముఖ నేత అయ్యారు. పార్లమెంట్‌లో తన అభిశంసనకు ప్రతిపక్షం నేతృత్వంలో జరిగిన యత్నాన్ని యూన్ తప్పించుకున్న మరునాడు ఈ పరిణామం చోటు చేసుకుంది. యూన్ అధ్యక్ష అధికారాలను సస్పెండ్ చేయడానికి కావలసిన మూడింట రెండు వంతుల మెజారిటీని నివారించేందుకు సభలో వోటింగ్‌ను అధికార పార్టీ సభ్యుల్లో అత్యధిక సంఖ్యాకులు బహిష్కరించారు.
యూన్‌పై కొత్త అభిశంసన తీర్మానాన్ని సిద్ధం చేస్తామని ప్రధాన ప్రతిపక్షం డెమోక్రాటిక్ పార్టీ ప్రకటించింది. ప్రాసిక్యూటర్ల దర్యాప్తును ఎదుర్కొన్న తరువాత సియోల్ నిర్బంధ కేంద్రంలో రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యాంగ్ హ్యున్‌న ఆదివారం నిర్బంధంలోకి తీసుకున్నారని పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. గోప్యత నిబంధనలకు అనుగుణంగా పేరు వెల్లడి చేయరాదని అధికారి విజ్ఞప్తి చేశారు. ఆయన ఇతర వివరాలు ఏవీ తెలియజేయలేదు. అయితే, కిమ్ ఐచ్ఛికంగా సియోల్ ప్రాసిక్యూటర్ ఆఫీస్‌కు వచ్చారని, అక్కడ ఆయన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, నిర్బంధంలోకి తీసుకున్నారని దక్షిణ కొరియా మీడియా తెలిపింది. కిమ్ పూర్వపు కార్యాలయాన్ని, నివాసాన్ని పోలీసులు ఆదివారం సోదా చేశారని సమాచారం.