ఈనాటి కొత్త తరాన్ని చూసినప్పుడు, వారి రచనల్ని చదివినప్పుడు, వారి భావాల్ని అవలోకించినప్పుడు, వారు వినిపించే సంగీతాన్ని విన్నప్పుడు, గీసే బొమ్మలనీ, రూపొందించిన సినిమాల్నీ చూసినప్పుడు సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఈ తరం ఆలోచించే విధానం, వాళ్ళు ఎంచుకునే అంశాలూ, వారి ఇమేజెస్, మెటాఫర్స్ వినూత్నమైన, విలక్షణ మైన దృశ్యాల్ని ఆవిష్కరిస్థాయి. ముఖ్యంగా లిబరలైజేషన్, ప్రైవటైజేషన్, గ్లోబలైజేషన్ల అనంతర కాలంలో జన్మించిన తరం ఆలోచనలు ఎంతో భిన్నంగా ఉంటున్నాయి.
ఇవాళ వారు చూస్తున్న లోకం భిన్నమైంది. పెరిగిన విస్తారమైన సాంకేతికత, ప్రసార మాధ్యమాలు వారి పైన తీవ్రమైన ప్రభావం కలిగిస్తున్నాయి. ఇంకో వైపు ఎక్కువ మందిని చేరేందుకు అవకాశాల్నీ అందిస్తున్నాయి. స్థానికత, ప్రాంతీయత పోయి ఆధునిక, ఆధునకానంతర కాలప్రభావం కొత్త తరం వారి సృజనలో స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా కవిత్వ రచనల్లో మనం గమనిస్తే గత తరాలు తమ స్కూలు, కాలేజీ కాలాల్లో పాఠ్యపుస్తకాల్లోనూ, బయటా చదివిన,చూసిన క్లాసికల్ కవిత్వం, లెజెండరీ కవుల కవిత్వానికి భిన్నంగా నేటి యువత తమ సృజనని కొనసాగిస్తున్నారు. రూపంలోనూ, సారంలోనూ కొత్త పోకడలకు తెర తీస్తున్నారు. అందులో అన్నీ మంచి పోకడలే వున్నాయని నేను అనను గానీ, విభిన్నమైన, మనసుకు హత్తుకునే కవిత్వం చాలానే రాస్తున్నారన్నది మాత్రం నిజం.
అలాంటి ఒక ఇండో కెనెడియన్ కవయిత్రి రూపి కౌర్ రాసిన మొదటి కవితా సంకలనం ఇటీవలే ‘అందుకున్నాను’. రూపి కౌర్ అక్టోబర్ 4, 1992 న పంజాబ్‌లో సిక్కుల కుటుంబంలో జన్మించారు. తనకు మూడేళ్ళు వయసులోనే కుటుంబంతో సహా కెనడాకు వలస వెళ్లారు. అక్కడ ఆ కుటుంబం ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. తండ్రి ట్రక్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అనేక ఏండ్ల పాటు సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లోనే వాళ్ళు నివసించారు. తరువాత ఆ కుటుంబం ఒంటారియోలోని బ్రమ్టన్‌లో స్థిరపడ్డారు. రూపి కౌర్ మొదట్లో అనేక ఏళ్ళ పాటు కీర్తనలు, భారతీయ శాస్త్రీయ సంగీతం పాడారు. ప్రదర్శనలు ఇచ్చారు. నిజానికి తాను వ్యోమగామి, ఫ్యాషన్ డిజైనర్ లేదా సామాజిక కార్యకర్త కావాలనుకున్నారు. రూపి కౌర్‌ని ఆమె తండ్రి ఉన్నత చదువుల కోసం అనుమతించలేదు. అంతే కాకుండా కౌర్ పదేళ్ళ వయసులో ఉండగానే, స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్ చాలా ఇబ్బంది పెట్టింది. ఇంగ్లీషు భాష లో పట్టు సాధించడానికి ఆమె చాలా కష్టపడ్డారు. అయితే అమృతా ప్రీతం, మాయా ఎంజేలో, రోల్ దహి, జె.కె. రౌలింగ్ ల రచనలు చదివిన తర్వాతనే ఆమె మనసు నిమ్మళపడింది.
రూపి కౌర్ ‘వాటర్లూ విశ్వవిద్యాలయం’లో ప్రొఫెషనల్ రైటింగ్ కోర్స్ చేశారు. అనంతరం స్కూలు, కాలేజీ విద్యార్థులకు సృజనాత్మక రచనల పైన క్లాసులు చెప్పారు. తాను ఒక పక్క సీరియస్‌గా అధ్యయనం చేస్తూనే మొదట తన ‘పర్ఫార్మింగ్ పోయెట్రీ’ని 2009లో మొదలు పెట్టారు. మొదట్లో ఆమె రచనల్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఇంకొందరయితే ఆమె రాసేదంతా చెత్త అని తీర్మానించారు. కాని రూపి తనదైన సొంత గొంతుక కోసం ఆరాటపడ్డారు. తనదైన స్వరం కోసం పోరాడారు. స్థిరంగా రాశారు, క్రమం తప్పకుండా రాశారు. పర్ఫాం చేశారు. కానీ, రూపి కవిత్వం రాయడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం వుండేది కాదు.అందుకే ఆమె తన హైస్కూలు స్థాయిలో అనామకంగానే గడిపారు. 2013 మొదట్లో తమ్బ్లార్ పేరుతో రాసిన ఆమె, ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌కు వచ్చాక చిన్న,చిన్న బొమ్మలతో తన కవిత్వాన్ని పంచుకోవడం మొదలు పెట్టారు.
రూపి కౌర్ మొదటి పుస్తకం ‘మిల్క్ అండ్ హనీ’. రూపి కౌర్ 18 ఏళ్ల వయసులోనే రచనా రంగంలోకి అడుగుపెట్టినది. ఆమె తన రచనల్లో ప్రధానంగా స్త్రీల శారీరక, మానసిక సమస్యల మీద రాశారు. ప్రేమ కోల్పోయినతనం, హింస, స్త్రీల అణచివేత తదితర అంశాలపైన కవిత్వం రాశారు. నిజానికి కవిత్వం కౌర్ జీవితంలో బాల్యం నుండే అంతర్భాగమైపోయింది. తండ్రి తన తల్లికి రోజు కవిత్వం గురించి గంటలకు గంటలు చెప్పేవాడు. అది ఆమెకు కవిత్వంతో తొలి పరిచయం.
తరువాత సనాతన కుటుంబ ఆచార వ్యవహారాల రీత్యా రూపి నెలసరి కాలంలో ఎదుర్కొన్న వివక్ష, హింసలు, చుట్టు పక్కల స్త్రీలు ముఖ్యంగా దక్షిణాసియా స్త్రీలు ఎదుర్కొన్న అణచివేత, దుఃఖం ఆమెను కదిలించాయి. ఆమెను తీవ్రమైన మానసిక సంక్షోభానికి గురిచేశాయి. మొదట్లో రూపి పంజాబీ భాషలో గురుముఖీ స్క్రిప్ట్‌లో రాయడం ఆరంభించారు. తన విశ్వవిద్యాలయ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆమె ఇన్‌స్ట్టాగ్రామ్ వేదిక పైన స్త్రీల రుతుసరి కాలపు ఫోటోల్ని ప్రచురించడంతో ఆమె అనేక మంది దృష్టిని ఆకర్షించారు. అనంతరం తన రచనల్ని వరుసగా పోస్ట్ చేయడం ఆరంభించారు. మొదట పుస్తకం కోసమని కాకుండా, తనను తాను వ్యక్తం చేయడానికి రాయడం మొదలెట్టిన రూపి కౌర్ అమెరికాలో వున్న ఆనవాయితీ ప్రకారం కవిత్వాన్ని వేదికల మీద ప్రెజెంట్ చేయడం ఆరంభించారు.
క్రమంగా ఆమె షోలు విజయవంతమయ్యాయి. ఇక తన రచనల్ని ప్రచురించడానికి ఏ పత్రికలూ ముందుకు రాకపోవడంతో తానే తన మొదటి పుస్తకాన్ని ప్రచురించుకున్నారు. పది వేల కాపీలు అమ్ముడయ్యాయి. 2017లో ఓ ప్రచురణ సంస్థ ‘మిల్క్ అండ్ హనీ’ పుస్తకాన్ని ప్రచురించింది. అది అనూహ్య విజయాన్ని సాధించి ఇప్పటికి 25 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. అంతేకాదు దాదాపు 25 భాషల్లోకి అనువదించబడింది.
‘ఇన్‌స్టా పొయెట్’ గా రూపి కౌర్ ది గొప్ప విజయం. ఆమె తన కవితలతో కొత్త తరాన్ని అమితంగా దగ్గరయ్యారు. ఆకట్టుకున్నారు. సీరియస్ కవిత్వ లక్షణాలు లేవనీ, ఆమె రాసేదంతా పాపులర్ రచనల కోవకు చెందినవేననీ, కేవలం చదువరులని చేరడమే లక్ష్యంగా రాస్తున్న కవిత్వమని ఆమె కవిత్వాన్ని విమర్శకులు విమర్శించారు.
కాని కౌర్ కవిత్వంలో వర్ధమాన స్త్రీ సమస్యలు, మానసిక శారీరక అణిచివేతల ప్రతిస్పందనలూ వున్నాయి. అలతి, అలతి మాటల్లో ఆమె వ్యక్తం చేస్తున్న భావాలు హృద్యంగా వున్నాయి. ఇవాళ ప్రపంచమంతా ఎంతో బిజీ. సమయం లేదు. అందరూ అటూ, ఇటూ పరుగులు పెడుతున్న సమయంలో ఈ ఇన్ స్టా కవిత్వం వేగంగా చదువరుల్ని ఆకట్టుకుంటున్నది. కొత్తతరం తమకు అందుబాటులోకి వచ్చిన కొత్త ప్రసార మాధ్యమాలైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి మాధ్యమాలలో కేవలం ఊసుబోని కబుర్లతో కాలక్షేపం చేయకుండా, నాలుగు కవితా పంక్తులు చదవడాన్ని, రాయడాన్ని మనసారా ఆహ్వానించాలి. అందులో భాగంగా రూపి కౌర్ విజయాన్ని నేను అభినందిస్తున్నాను. రూపి కౌర్ పుస్తకాలు అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో వున్నాయి.
వారాల ఆనంద్