Thursday, December 12, 2024

విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ క్యాబినెట్ విజయం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని మంత్రివర్గం సోమవారం శాసనసభలో విశ్వాస తీర్మానాన్ని గెలిచింది. శివసేన ఎంఎల్‌ఎ ఉదయ్ సామంత్ ప్రభృతులు ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని సభ మూజువాణి వోటుతో ఆమోదించింది. విశ్వాస తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. 288 మంది సభ్యులు ఉన్న శాసనసభలో బిజెపి, శివసేన, ఎన్‌సిపితో కూడిన మహాయుతి కూటమికి 230 సీట్లతో అఖండ ఆధిక్యం ఉంది. అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 144. ‘విశ్వాస తీర్మానాన్ని మెజారిటీతో ఆమోదించడమైంది, శాసనసభ ఇప్పుడు వాయిదా పడుతుంది. మహారాష్ట్ర గవర్నర్ ప్రసంగం తరువాత సభ తిరిగి సమావేశం అవుతుంది’ అని నర్వేకర్ శాసనసభలో వెల్లడించారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా మూడవ విడత ఈ నెల 5న ప్రమాణ స్వీకారం చేశారు.

ముంబయిలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన కార్యక్రమంలో ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. 15వ శాసనసబ అధికారికంగా తన హయాంను ఈ నెల 7న ప్రారంభించింది. బిజెపి నాయకత్వంలోని కూటమికి సభలో 230 సీట్లు ఉండడంతో దిగువ సభలో బల పరీక్ష కేవలం లాంఛనప్రాయమే. శివసేన నేత, మాజీ మంత్రి ఉదయ్ సామంత్, బిజెపి శాసనసభ్యుడు సంజయ్ కుటె, ఎన్‌సిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దిలీప్ వల్సె పాటిల్, స్వతంత్ర ఎంఎల్‌ఎ రవి రాణా దిగువ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. స్పీకర్‌గా నర్వేకర్ నియామకంతో మహాయుతి కూటమికి చిన్న పార్టీలు, స్వతంత్ర ఎంఎల్‌ఎలతో సహా 229 మంది ఎంఎల్‌ఎల మద్దతు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News