Thursday, January 16, 2025

చెన్నమనేని జర్మనీ పౌరుడే

- Advertisement -
- Advertisement -

తప్పుడు పత్రాలతో కోర్టును
తప్పుదోవ పట్టించారు
వేములవాడ మాజీ ఎంఎల్‌ఎ
రమేష్‌పై హైకోర్టు ఆగ్రహం
రూ.30లక్షల జరిమానా

బిఆర్‌ఎస్ నేత, వేములవాడ మాజీ ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేష్‌కు ఎట్టకేలకు షాక్ తగిలింది. పౌరసత్వం కేసులో చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ దేశ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని స్పష్టం చేసింది. కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని పేర్కొంది. అంతేగాక, చెన్నమనేని రమేష్‌కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. దీనిలో రూ. 25 లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్, వేములవాడ ఎంఎల్‌ఎ ఆది శ్రీనివాస్‌కు ఇవ్వాలని, రూ. 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. చెన్నమనేని రమేష్ కు జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందారని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

దీనిపై అప్పట్లోనే విచారణ జరిపిన కేంద్ర ప్రభుత్వం.. 2017లో రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా మరోసారి పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పునర్ పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయం సరైనదేనంటూ రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మరోసారి స్పష్టం చేసిం ది. దీంతో చెన్నమనేని రమేష్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. చెన్నమనేని రమేష్ జర్మనీ ప్రయాణ వివరా లు ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సంబంధిత రికార్డులను హైకోర్టుకు అందజేసింది. అయితే, జర్మ నీ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు హైకోర్టులో చెన్నమనేని రమేష్ మెమో దాఖలు చేశారు. దీంతో చాలా ఏళ్లుగా రమేష్ పౌరసత్వానికి సంబం ధించి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే, తాజాగా, సోమవారం ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తవడంతో చెన్నమనేని రమేష్ దాఖ లు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని తేల్చి చెప్పిన హైకోర్టు అతనికి రూ. 30 లక్షల జరిమానాను విధించింది. హైకోర్టు తీర్పును ఆది శ్రీనివాస్ స్వాగతించారు. తన 15 ఏళ్ల న్యాయ పోరాటం ఇన్నేళ్లకు విజయం సాధించిందన్నారు. కాగా, 2014లో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున వేములవాడ నియోజకవర్గం నుంచి చెన్నమనేని రమేష్ బాబు అసెంబ్లీకి పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో చెన్నమనేని రమేష్ బాబు గెలుపొందారు. దీనిపై ఆది శ్రీనివాస్ కోర్టుకెక్కారు. చెన్నమనేని రమేష్ బాబు దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుల తడక అని, చెన్నమనేని రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉందని ఆరోపించారు. ఈ కారణంగా చెన్నమనేని రమేష్ బాబు ఎన్నిక చెల్లదని వాదించారు. ఈ కేసు విచారణలో ఉండగానే 2018లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగగా చెన్నమనేని రమేష్ బాబు వేములవాడ నుంచి మళ్లీ గెలుపొందారు. తాజాగా ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News