Thursday, December 12, 2024

వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్ళిన ఆర్‌టిసి బస్సు,స్కూల్ బస్సు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆర్‌టిసి బస్సు, స్కూల్ బస్సుకు పెనుప్రమాదాలు తప్పాయి. వివరాల్లోకి వెళ్తే.. అసలే గతుకుల రోడ్డు..ఆపై డ్రైవర్ మితిమీరిన వేగంతో ఆర్‌టిసి బస్సును నడపడంతో కుదుపునకు గురై వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్ళింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండలం, ఇర్విన్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రయాణికులు, విద్యార్థుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండకు వెళ్తోంది. ఈ బస్సులో నల్గొండ జిల్లా, మాల్ వద్ద అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడంతో కిటకిటలాడుతూ ముందుకు కదిలింది. మార్గమధ్యలో మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఇర్విన్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేందుకు సుమారు 80 మంది విద్యార్థులు కూడా ఇదే బస్సు ఎక్కారు. అ

ప్పటికే బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉండడంతో బస్సులో ప్రయాణికుల పరిమితి దాటింది. ఇర్విన్ సమీపంలో ఈద్గా వద్ద రోడ్డుపై ఉన్న గుంతల్లో బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురై ఎడమవైపు వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్ళింది. ఇటీవల వర్షం కురవడంతో భూమి బురదమయంగా ఉన్నందున బస్సు ముందు చక్రాలు భూమిలోకి దిగబడడంతో బస్సు ఆగింది. భూమి పొడిగా ఉంటే బస్సు పొలంలోకి దూసుకెళ్ళిన వేగానికి బోల్తాపడి తీవ్ర ప్రాణనష్టం జరిగి ఉండేదని, ఊహించుకుంటేనే భయమేస్తోందని ప్రత్యక్ష సాక్షులు ఆందోళన వ్యకం చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, విద్యార్థులు ఒకరిపై మరొకరు పడడంతో పలువురు గాయపడ్డారు. బస్సు వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్ళడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. అయితే, తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఇర్విన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి బన్ని, 9వ తరగతి విద్యార్థి పావని స్వల్పంగా గాయపడినట్ల్లు పాఠశాల యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు.

అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ మండలం, బండమాదారం గ్రామ పరిధిలో మేడ్చల్‌లోని చాణిక్య విజన్ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాయిలాపూర్ నుండి బండమారం గ్రామానికి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే పాఠశాల బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న పలువురు స్థానికులు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చారు.–

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News