Wednesday, January 15, 2025

నెహ్రూను కనుమరుగు చేస్తారా!

- Advertisement -
- Advertisement -

గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి ముజీబ్ ఉర్ రెహమాన్ అని టైప్ చేయగానే అఫ్ఘాన్ క్రికెటర్ అని చూపిస్తుంది. పాకిస్తాన్‌తో పోరాటం చేసి బంగ్లాదేశ్ సాధించుకున్న యోధుడు ముజీబ్ ఉర్ రెహమాన్ ముందు కనిపించడు. ముజీబ్ ఉర్ రెహమాన్ పొలిటీషియన్ అని టైప్ చేస్తే తప్ప ఆయన వివరాలు మనకు దొరకవు. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన ఆయన కేవలం రాజకీయ నాయకుడేనా? ఈ ఉపోద్ఘాతం ఇప్పుడు ఎందుకు అంటే సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో ఇవాళ కనిపించింది ఒక విషయం. బంగ్లాదేశ్‌లో అక్కడి కరెన్సీ మీద బంగ బంధు షేక్ ముజీబ్ ఉర్ రెహమాన్ చిత్రాన్ని తొలగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిందని.

బంగ్లాదేశ్ పరిణామాల గురించి మనకు తెలుసు. ఇటీవలే ఆయన కూతురు షేక్ హసీనా పదవీచ్యుతురాలై ప్రవాస జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశానికి నాయకత్వం వహిస్తున్నాయన ఈ ఆలోచన చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఏమైనా జరగవచ్చు. విప్లవకారుడు, రాజనీతిజ్ఞుడు, బంగ్లాదేశ్ విముక్తి పోరాట యోధుడు తరువాతి కాలంలో ఒక తిరుగుబాటులో అమరుడైన వాడు షేక్ ముజీబ్ ఉర్ రెహమాన్. ఆయనను బంగ బంధుగా, భారత దేశం మహాత్ముడిని జాతిపిత అని పిలుచుకున్నట్టుగా వ్యవహరిస్తారు. అటువంటి నాయకుడికి ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న గౌరవం ఏమిటో చూస్తున్నాం.

ఈ వార్త చదువుతున్న సమయంలోనే ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ కు సంబంధించిన ఒక పుస్తకావిష్కరణ సభ జరుగుతున్నది. ‘నెహ్రూస్ ఇండియా పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్’ (నెహ్రూ భారతం-గతం, వర్తమానం, భవిష్యత్తు) పేరిట ఆదిత్య ముఖర్జీ అనే రచయిత రాసిన ఈ పుస్తకం విడుదల సందర్భంగా ఢిల్లీ జవహర్ భవన్‌లో మాట్లాడిన వక్తలందరూ భారత ప్రజాస్వామ్యానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా, దాని సార్వభౌమత్వం చెక్కుచెదరకుండా దేశాన్ని పారిశ్రామికీకరణ వైపు, ఆధునీకరణ వైపు తీసుకుపోయిన నెహ్రూవియన్ మోడల్ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని కొనియాడారు. నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ సొంతం కాదని ఆయన ఈ దేశ వారసత్వ సంపద అని, ఆ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావించారు. బ్రిటిష్ వారు వదిలిపోయిన మట్టిని, మురికిని తొలగించి దేశాన్ని బాగు చేయడంలో నెహ్రూ ఆలోచనలు, ఆయన విధానాలు ఎంతో ఉపకరించాయి భారతదేశానికి అన్నారు. గత 70 సంవత్సరాలలో ఈ దేశంలో ఏమీ జరగలేదని మాట్లాడే వాళ్లకు కొన్ని విషయాలు గుర్తు చేయాలి.

స్వతంత్ర భారత తొలి ప్రధాన మంత్రిగా నెహ్రూ బాధ్యతలు చేపట్టే నాటికి ఈ దేశంలో మనుషుల ఆయుర్దాయం సగటున 30 ఏళ్ల వరకు. జనాభాలోని ఎనభై అయిదు శాతం మంది నిరక్షరాస్యులు. మహిళలైతే 94 శాతం మంది నిరక్షరాస్యలే. దేశం మత ప్రాతిపదికన చీలిపోయి ఉండింది. తీవ్రమైన కరువు పరిస్థితులు. స్వాతంత్య్రానికి కేవలం నాలుగు సంవత్సరాల ముందు కరువు కారణంగా 30 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని ఒక లౌకిక, ప్రజాస్వామ్య, మానవతా గమ్యం వైపు నడపడానికి నెహ్రూ వేసిన బాటను మరిపించే ప్రయత్నాలు ఇవాళ జరుగుతున్నాయి. సరైన సమయంలో ఆదిత్య ముఖర్జీ ఈ పుస్తకం రాశారనిపించింది. బంగ్లాదేశ్‌లో ముజీబ్ ఉర్ రెహమాన్‌ను, భారత దేశంలో జవహర్ లాల్ నెహ్రూను కనుమరుగు చేసే, వారిని చరిత్ర నుండి చెరిపేసే ప్రయత్నాలు చూస్తుంటే ఎప్పుడో అప్పుడు మహాత్ముని మాత్రం వదిలిపెడతారా అనే సందేహం కలగక మానదు.

సౌజన్యరావు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News