Thursday, December 12, 2024

సిరియాలో ప్రజాస్వామ్యం పాదుకొనేనా?

- Advertisement -
- Advertisement -

యాభయ్యేళ్లకు పైగా నియంతల కుటుంబ పాలనలో మగ్గిపోయిన సిరియా ప్రజలకు ఎట్టకేలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించాయి. ఒక్కొక్క నగరాన్నే గెలుచుకుంటూ, గత పది రోజులుగా తిరుగుబాటుదారులు సాధిస్తున్న వరుస విజయాలు, రాజధాని డమాస్కస్‌ను కైవసం చేసుకోవడంతో పరిపూర్ణమయ్యాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి తిరుగుబాటుదారులతో కలసి సంబరాలు చేసుకున్నారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వదిలి మాస్కోకు పరారయ్యారు. బషర్ తండ్రి హఫీజ్ 1971లో అప్పటి ప్రభుత్వాన్ని కూల్చి అధికార పగ్గాలు చేపట్టింది మొదలు సిరియా ప్రజలకు కంటి మీద కునుకు కరవైందంటే అతిశయోక్తి కాదు. దేశాన్ని ముప్పయ్యేళ్లు అప్రతిహతంగా పాలించిన హఫీజ్ తదనంతరం ఆయన కుమారుడు, విద్యాధికుడు అయిన బషర్ పాలన పగ్గాలు చేపట్టడంతో ప్రజల్లో ఆశలు మోసులెత్తాయి.

అయితే, బషర్.. తండ్రిని మించిన కుటిల రాజనీతిజ్ఞతతో, నియంతృత్వ విధానాలతో దేశ ప్రజలకు నరకమంటే ఏమిటో రుచి చూపించారు. బషర్ అరాచక పాలనను అంతమొందించేందుకు గత 13 ఏళ్లుగా దేశంలో తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. 2011లో ఉవ్వెత్తున ఎగసిన అంతర్యుద్ధాన్ని రష్యా, ఇరాన్‌ల సహాయంతో బషర్ దారుణంగా అణచివేశారు. ఆనాటి ఘర్షణల్లో ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, కోటి మందికి పైగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసపోయారు. 2011-15 మధ్య కాలంలో అక్కడి సెడ్నయా జైలులో సుమారు 13 వేల మందిని కిరాతకంగా హతమార్చారంటే బషర్ పరిపాలన ఎంత కర్కశంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ జైలును మానవతావాదులు ‘మానవ వధశాల’గా అభివర్ణించడంలో ఆశ్చర్యం ఏముంది? సిరియాలో బషర్ ప్రభుత్వం కూలిపోయినంతమాత్రాన సిరియన్లకు మంచి రోజులు వచ్చాయని అనుకోలేం.

తాజా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన హయాత్ తహరీర్ అల్ షామ్ (హెచ్‌టిఎస్)ను పశ్చిమ దేశాలు ఏనాడో ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. పైగా దీనికి నేతృత్వం వహిస్తున్నది ఒకప్పటి అల్ ఖైదా ఉగ్రవాద నాయకుడే కావడం గమనార్హం. గతంలో కొన్ని పట్టణాలను తన చెప్పుచేతల్లోకి తీసుకున్న ఈ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ చట్టాలనే అమలు చేస్తూ, ప్రజలను నిర్బంధానికి గురిచేస్తోంది. దేశంలోని దక్షిణ భాగంలో కొన్ని ప్రాంతాలపై స్థానిక మైనారిటీ గ్రూపులు పట్టు సాధించాయి. మరిన్ని తిరుగుబాట్లు తలెత్తకుండా ఉండాలంటే వీటన్నింటిని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అయితే వీటిని హెచ్‌టిఎస్ ఒక్కతాటిపైకి ఎలా తీసుకువస్తుందనేది ప్రశ్నార్థకం.

దేశంలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో తిష్ఠవేసుకుని కూర్చున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అణచివేసేందుకు అమెరికా దళాలు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో అగ్రరాజ్యానికి హెచ్ టిఎస్ ఎంతమేరకు సహకరిస్తుందనేది వేచిచూడవలసిన అంశం. సిరియాలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అమెరికా, ప్రభుత్వ పతనాన్ని ఐసిస్ ఉగ్రవాదులు అవకాశంగా మలచుకోకుండా ఉండేందుకు వాటిపై తాజాగా వైమానిక దాడులకు దిగడం స్వాగతించదగినది. రాజ్యహింసను, అరాచక పాలనను ప్రజలు ఎంతోకాలం సహించలేరనీ, ఏదో ఒక రోజు వారు తిరగబడితే నియంతలు తోకముడవక తప్పదన్న నగ్నసత్యం తాజాగా సిరియాలో మరొకసారి నిరూపితమైంది. గతంలో వలసపోయిన లక్షలాది మంది సిరియన్లు భవిష్యత్తుపై గంపెడాశతో తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు.

నియంత పాలనకు తెరదిగడంతో తమ జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తాయనీ, మంచికాలం ముందున్నదనీ సిరియన్లు ఆశించి సంబరపడటంలో తప్పులేదు. సిరియాను ప్రజాస్వామిక దేశంగా మలచేందుకు కృషి చేస్తామంటూ తిరుగుబాటుదారులు హామీనివ్వడం చిమ్మచీకటిలో వెలుగురేఖగా తోస్తున్నది. అయితే, దేశ పునర్నిర్మాణం ఎలా జరుగుతుందన్నదే ప్రధాన ప్రశ్న. మరోసారి ప్రజల ఆశలు అడియాసలు కాకూడదంటే అంతర్జాతీయ సమాజం సానుభూతితో, సోదరభావంతో సిరియాను ఆదుకోవాలి. స్వీయ రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి, అర్ధ శతాబ్ద కాలంగా నియంతల పాలనలో మగ్గిపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ఔదార్యం ప్రదర్శించాలి.

ఇప్పటివరకూ బషర్ ప్రభుత్వానికి వంతపాడిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇకనైనా సిరియన్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశ పునర్నిర్మాణానికి ఇతోధిక సహాయం అందించవలసిన అవసరం ఉంది. అసద్‌ల పాలనలో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు, ప్రజాస్వామిక వ్యవస్థను పాదుగొల్పేందుకు ఐక్యరాజ్యసమితితోపాటు అంతర్జాతీయ సంస్థలు సైతం ముందుకు రావాలి. అంతర్యుద్ధాలతో దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోవంతో దేశ జనాభాలో 80 శాతం మంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. వారికి మానవతాసాయం అందించడం ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News