తిరుపతి: తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం పట్ల ఎపి సిఎం ఎన్ చంద్రబాబు నాయుడు సోమవారం టిటిడిని అభినందించారు. X వేదికపై తన అభినందనలను పోస్ట్ చేస్తూ, “తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల దివ్య వైభవాన్ని వీక్షించడం నిజంగా ఆనందంగా ఉందన్నారు. ఈ పవిత్రమైన పండుగ తమ హృదయాలను నింపడానికి అమ్మవారి అనంతమైన అనుగ్రహానికి ప్రగాఢ చిహ్నంగా పనిచేస్తుందన్నారు. ఆధ్యాత్మిక ఉత్సాహంతో, మన సంప్రదాయాలు ఉట్టిపడేలా జరిపారన్నారు.
టిటిడి ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో ఏర్పాట్లు చేసుకుని క్షేత్ర స్థాయిలో అమలు చేయడం వల్ల భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు అందేలా చేశారని సిఎం అభినందించారు. ఈ ఏడాది తిరుచానూరులో వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28న ప్రారంభమై డిసెంబర్ 6న ముగిశాయి. పంచమీ తీర్థం సందర్భంగా పవిత్ర పద్మ పుష్కరిణిలో వేలాది మంది భక్తులు పంచమి తీర్థ స్నానం ఆచరించేందుకు టిటిడి ఏర్పాట్లు చేసింది.
టిటిడి ఛైర్మన్ శ బిఆర్ నాయుడు, ఇఒ శ్యామలరావు ఆదేశాల మేరకు టిటిడి యంత్రాంగం, జిల్లా పోలీసులు, తిరుచానూరు పంచాయతీ అధికారులు సమన్వయంతో భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పారిశుధ్యం, క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి పలు ఏర్పాట్లు చేశారు. టిటిడి చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేయడం పట్ల సిఎం చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు.