1958 నాటి సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం (అఫ్స్పా) రద్దు చేయాలని, సంక్షుభిత రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంగళవారం వేలాది మంది ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. అఫ్స్పా మానవ హక్కులకు వ్యతిరేకమైనదని, అది సైన్యానికి రక్షణ ఇస్తున్నదని, ‘దాని వల్ల భద్రత దళాలు అత్యాచారాలు చేస్తున్నార’ని పేర్కొంటూ నిరసనకారులు బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. వారిలో అధిక సంఖ్యాకులు మహిళలు. ‘అఫ్స్పా పైశాచిక చట్టం. మేం మానవ హక్కులను గౌరవించాలంటే, ఆ చట్టాన్ని రద్దు చేయవలసిందే. శాంతి భద్రతల అమలు పేరిట ఒక పైశాచిక చట్టాన్ని వినియోగించడం ఆమోదనీయం కాదు.
ఎందుకంటే అటువంటి చట్టం మణిపూర్‌లో మౌలిక మానవహక్కులను ఉల్లంఘించింది’ అని నిరసనకారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఇంఫాల్‌లో ఈ నిరసన ప్రదర్శన జరగడం గమనార్హం. ఆల్ మణిపూర్ యునైటెడ్ క్లబ్ ఆర్గనైజేషన్, పొయిరై లైమరోల్ అపున్బ మైరా పైబి, అఖిల మణిపూర్ మహిళల వాలంటరీ సంఘం, మానవ హక్కుల కమిటీ, మణిపూర్ విద్యార్థుల సమాఖ్య ఈ ప్రదర్శనను నిర్వహించాయి. క్రితం నెల ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో అఫ్‌స్పాను కేంద్రం తిరిగి విధించిన కొన్ని వారాల తరువాత ఈ నిరసన ప్రదర్శన చోటు చేసుకుంది. అయితే, మైతై తెగకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు సంస్థలు నిరసనలను ఉద్ధృతంచేస్తామని బెదరించిన తరువాత అఫ్స్పా ఉపసంహరణ కోరుతూ రాష్ట్రంలో బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయవలసి వచ్చింది.