Thursday, December 12, 2024

తైవాన్ చుట్టూ చైనా బలగాల మోహరం

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : తైవాన్ ద్వీపం చుట్టుపక్కల సముద్ర జలాల్లో చైనా దూకుడు పెరిగింది. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో డ్రాగన్ తన బలగాలను తైవాన్ చుట్టుపక్కల మోహరించింది. దీంతో తైవాన్ జలసంధిలో సైనిక కార్యకలాపాలు పెరిగాయి. తాజాగా చైనా తన మోహరింపులపై బుధవారం స్పందించింది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. వేర్పాటువాద కార్యకలాపాలను ఏమాత్రం సహించమని పేర్కొంది.

చైనా లోని తైవాన్ అఫైర్స్ ఆఫీస్ విభాగం ప్రతినిధి ఝఫెంగ్లియాన్ మాట్లాడుతూ.. “ తైవాన్ వేర్పాటువాదులు బాహ్యశక్తులతో కుమ్మక్కు అయ్యే చర్యలపై బీజింగ్ అత్యంత అప్రమత్తంగా ఉంది. మా దృష్టిలోకి రానిది ఏదీ జరగనీయం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి తైవాన్ జలసంధిలో సుస్థిరత నెలకొల్పడానికి అన్ని చర్యలు తీసుకొంటాం” అన్నారు. మరోవైపు ఈ మోహరింపులు ఎందుకోసమనే అంశంపై పీఎల్‌ఏ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇటీవల తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తె అమెరికాకు చెందిన హవాయి, గువామ్‌లో పర్యటించారు. ఈ చర్యలు బీజింగ్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఈ నేపథ్యంలో తైవాన్ చుట్టుపక్కల భారీగా సైనిక మోహరింపులు మొదలు పెట్టింది. దీనిపై తైవాన్ సీనియర్ అధికారి ఒకరు ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ అమెరికాలో కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న కార్యవర్గానికి ఓ రాజకీయ సందేశం పంపడం కోసం బీజింగ్ ఇలా చేస్తోందని అభిప్రాయపడ్డారు.

దాదాపు 70 రోజుల పాటు చైనా సైన్యం ప్లానింగ్ చేసి ఆమేరకు తాజాగా మోహరింపులు చేపట్టిందని తైవాన్ మిలిటరీ అంచనా వేసింది. ఇప్పటికే తైవాన్ అధ్యక్షుడు లాయ్ ప్రభుత్వం తమ దేశంపై బీజింగ్ సార్వభౌమ హక్కులను కొట్టిపారేసింది. మంగళవారం తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ స్పందిస్తూ గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో బీజింగ్ తన నౌకాదళాన్ని మోహరించిందని వెల్లడించింది. గతంలోచైనా చేసిన యుద్ధ విన్యాసాల కంటే ఇది తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News