తెలంగాణ కోసం ఒక్కనాడైనా సిఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారా? జై తెలంగాణ అని అన్నారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ప్రశ్నించారు. బుధవారం సంగారెడ్డిలోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ఎంఎల్‌ఎ చింతాప్రభాకర్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వకుండా, తెలంగాణకు పోవాలంటే నాడు పాస్‌పోర్టు కావాలా? అని అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోట్లాది మంది ప్రజల అభిమతాన్ని అవహేళన చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. వంద ఎలుకలు తిన్న రాబందు తీర్థయాత్రలకు పోయినట్టుగా, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా సిఎం వైఖరి ఉందని మండిపడ్డారు. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని, ఆత్మహత్యలు, బలిదానాలకు ఆ పార్టీనే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదన్నారు.
తెలంగాణ కోసం రేవంత్‌పై ఒక్క కేసు అయినా ఉందా అని ప్రశ్నిస్తూ అదే సమయంలో తమపై వందల కేసులున్నాయని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రేవంత్‌రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అని అన్నారని, ఇప్పుడు ఆమెను దేవత అని అంటున్నారని వ్యాఖ్యా నించారు. తెలంగాణ చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదని, ఉద్యమం గురించి రేవంత్‌రెడ్డి చెప్పిందే చరిత్ర కాదని, వక్రీకరిస్తే చరిత్ర మారిపోదన్నారు. తెలంగాణ సాధకుడిగా మాజీ సిఎం కెసిఆర్‌కు ఉన్న కీర్తి చెరిగిపోదన్నారు. ప్రజలు కెసిఆర్ నాయకత్వంలో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని అన్నారు. తెలంగాణ తల్లిని మార్చడమా మార్పు అని ప్రశ్నించారు. 2004లోనే సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, ఒక్క ప్రాణం కూడ పోయేది కాదన్నారు. నాటి జెఎసి ఛైర్మన్ కోదండరాం అందరు ఎంఎల్‌ఎలు రాజీనామా చేయాలని అంటే, రేవంత్‌రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు.
రెండు కళ్ల సిద్ధాంతి చంద్రబాబు నాయుడు సేవలో రేవంత్‌రెడ్డి ఉన్నారని, తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు పక్కన ఉన్నారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసిన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటననే ఢిల్లీ నుండి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా అధికారికంగా ఏర్పాటు చేయలేదని అనడం దారుణమన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో 2015లో ఏర్పాటు చేసిన విగ్రహం ఫొటోను ఈ సందర్భంగా చూపించారు. విద్యార్థులు చనిపోవడం, టిఎస్‌ను టిజి చేయడం, పథకాలను రద్దు చేయడం, ప్రజలను మోసగించడమే రేవంత్‌రెడ్డి తెచ్చిన మార్పు అని ఎద్దేవా చేశారు. భారతమాతను ఎక్కడా మార్చలేదని, కన్నడతల్లిని, తమిళతల్లిని, తెలుగుతల్లిని ఎక్కడా మార్పు చేయలేదని పేర్కొన్నారు.
అలాంటిది చరిత్రను చెరిపేందుకు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిన దుష్ట చరిత్ర రేవంత్‌రెడ్డిదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ ఛైర్మన్ పట్నం మాణిక్యం, టిఎన్‌జిఓ మాజీ అధ్యక్షుడు రాజేందర్, బిఆర్‌ఎస్ నాయకులు మందుల వరలక్ష్మి, మనోహర్‌గౌడ్, నాగారాజుగౌడ్, వెంకటేశ్వర్లు, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.