హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనతో ఆయనతో పాటు థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 4న పుష్ప-2 బెనిఫిట్ షోను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆర్‌టిసి క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మరణించారు. బెనిఫిట్ షో కోసం హీరో అల్లు అర్జున్ రావడంతో తమ స్టార్ హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకోవడంతో, పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి అభిమానులను చెదరగొట్టారు.
పోలీసులు ఒక్కసారిగా అందరిని చెదరగొట్టే సమయంలో తొక్కిసలాట జరగడంతో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కింద పడిపోయారు. జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు. వారిద్దరికి తీవ్రగాయాలు కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అక్కడ జనాలను క్లియర్ చేసి తల్లీకుమారులను పోలీసులు పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వస్తున్నట్లు నిర్వాహకులు చెప్పకపోవడం, తగినంత మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోకపోవడం దీనికి తోడు బన్నీ టీమ్ కూడా తమకు సమాచారం ఇవ్వలేదని హీరో అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా అతను తనపై కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టును ఆశ్రయించిన సంధ్య థియేటర్ ఓనర్
సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ బుధవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. రేవతి మృతికి తమకు సంబంధం లేదని పిటిషన్‌లో వెల్లడించారు. అలాగే ప్రీమియర్, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతిచ్చింది అని పుష్ప-2 సినిమాకు తాము ప్రీమియర్ షోలు నిర్వహించలేదని, డిస్ట్రిబ్యూటర్లు నేరుగా సినిమాను నడిపించుకున్నారని, అయినప్పటికీ తమ వంతుగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. అయినప్పటి మాపైనే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయమని సంధ్య థియేటర్ యజమాని రేణుక దేవి తన పిటిషన్లో పేర్కొన్నారు.