పుణె: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్, టాటా గ్రూప్ గ్లోబల్ ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్ విభాగమైన టాటా ఇంటర్నేషనల్ పుణెలో కొత్త రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF)ని ప్రారంభించాయి. ‘Re.Wi.Re – రీసైకిల్ విత్ రెస్పెక్ట్’ పేరుతో ఈ అత్యాధునిక కేంద్రం పర్యావరణ అనుకూల ప్రక్రియలతో 21,000 కాలం చెల్లిన వాహనాలను సురక్షితంగా విడదీయగల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ RVSF టాటా ఇంటర్నేషనల్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ టాటా ఇంటర్నేషనల్ వెహికల్ అప్లికేషన్స్ (TIVA)చే నిర్వహించబడుతుంది. ఇది అన్ని బ్రాండ్‌ల ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను స్క్రాప్ చేయడానికి రూపొందించబడింది.
ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ, ‘‘మొబిలిటీ భవిష్యత్తును రూపొందించడంలో టాటా మోటార్స్ ముందంజలో ఉంది. సంస్థ ఉత్పత్తులు, సేవలు, డిజిటల్ సొల్యూ షన్‌లతో విలువలను అందించడం ద్వారా విజయవంతమైన కస్టమర్‌లను భాగస్వాములుగా చేయడంపై దృష్టి పెట్టింది. ఒక వృత్తాకార ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో మా నిబద్ధతను Re.Wi.Re సూచిస్తుంది. కాలం చెల్లిన వాహనాల అధునాతన రీసైక్లింగ్ ప్రక్రియల నుండి గరిష్ట విలువను సేకరించడం మాత్రమే కాదు, దేశ సుస్థిరత లక్ష్యాల సాధనకు కూడా దోహదపడుతుంది. అనేక అంతర్జాతీయ మార్కెట్లలో టాటా ఇంటర్నేషనల్ మా భాగస్వామిగా ఉంది. Re.Wi.Re తో కొత్త అధ్యాయాన్ని జోడించడం ద్వారా మా దీర్ఘకాలిక అనుబంధాన్ని మరింత శక్తివంతం చేసుకుంటున్నాం’’ అని అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టాటా ఇంటర్నేషనల్ వెహికల్ అప్లికేషన్స్ సిఇఒ రాజీవ్ బాత్రా మాట్లాడుతూ, “భారత దేశంలో వాహనాల జీవితచక్రానికి సంబంధించిన విధానాన్ని మార్చడంలో టివా, టాటా మోటార్స్ కీలకమైన చర్య తీసు కున్నాయి. ఏటా 21,000 వాహనాలను స్ర్కాప్ చేసే సామర్థ్యంతో, ఈ కేంద్రం సమర్థవంతమైన, సురక్షితమైన వాహన రీసైక్లింగ్ కోసం పెరుగుతున్న అవసరాన్ని పరిష్కరించడానికి రూపొందించబడింది. మన సమాజానికి సుస్థిరమైన, వ్యవస్థీకృత పర్యావరణ వ్యవస్థ ను తీర్చిదిద్దడంలో కాలం చెల్లిన వాహనాల నిర్వహణ పోషించే కీలకపాత్రను మేం అర్థం చేసుకున్నాం. మరింత పరిశుభ్రమైన, మరింత నియంత్రిత వాహన రీసైక్లింగ్ ఫ్రేమ్ వర్క్ దిశగా భారతదేశ పయనానికి ఈ కార్యక్రమం అండగా నిలుస్తుంది. టివాలో మేం నిరంతరంగా కొత్త శిఖరాలను చేరు కోవడానికి, మేం సేవలందిస్తున్న కమ్యూనిటీలకు మా ఉత్తమమైన వాటిని అందించడానికి కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.
Re.Wi.Re. అనేది పర్యావరణ అనుకూల పద్ధతులను ఉపయోగించడంపై దృష్టి సారించి, అన్ని బ్రాండ్‌లలో కాలం చెల్లిన ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను నిర్వీర్యం చేయడానికి ఉద్దేశించిన అత్యాధునిక కేంద్రం. జైపుర్, భువనేశ్వర్, సూరత్, చండీగఢ్, దిల్లీ ఎన్సీఆర్ లలో ఇప్పటికే ఐదు Re.Wi.Re. కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి.
ప్రతి Re.Wi.Re కేంద్రం పూర్తిగా డిజిటలైజ్ చేయబడింది. దాని కార్యకలాపాలన్నీ తిరుగులేని విధంగా, కాగిత రహితంగా ఉంటాయి. వాణిజ్య, ప్యాసింజర్ వాహనాలకు సంబంధించి సెల్-టైప్ మరియు లైన్-టైప్ డిస్మాంట్లింగ్ ఇక్కడ ఉంటుంది. టైర్లు, బ్యాటరీలు, ఇంధనం, నూనెలు, ద్రవాలు, వాయువులతో సహా వివిధ భాగాలను సురక్షితంగా విడదీయడానికి ప్రత్యేక స్టేషన్లు ఉన్నాయి. ప్రతి వాహనం కూడా ప్యాసింజర్, వాణిజ్య వాహనాల బాధ్యతాయుతమైన స్క్రాపింగ్ అవ సరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన కచ్చితమైన డాక్యుమెంటేషన్, ఉపసంహరణ ప్రక్రియకు లోనవుతుంది. దేశ వాహన స్క్రాపేజ్ విధానం ప్రకారం అన్ని భాగాలను సురక్షితంగా పారవేయడానికి ఇది హామీ ఇస్తుంది. Re.Wi.Re. కాన్సెప్ట్ మరియు ఈ కేంద్రం వాహన పరిశ్రమలో సుస్థిరమైన పద్ధతులను పెంపొందించే దిశగా సంచలనాత్మక అడుగు వేసేందుకు పురోగమింపజేస్తుంది.
టాటా ఇంటర్నేషనల్ వెహికల్ అప్లికేషన్స్ (TIVA) భారతదేశ అతిపెద్ద ట్రైలర్ తయారీదారు. అజ్మీర్, జంషెడ్‌పుర్, పుణెలలో ఉన్న నాలుగు అత్యాధునిక తయారీ కేంద్రాలతో, కంపెనీ ట్రైలర్ మరియు ట్రక్ బాడీ-మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ప్రముఖ శక్తిగా స్థిరపడింది. విభిన్నమైన ఉపయోగాలను అందించడానికి ఇది తన అధునాతన ఇంజనీరింగ్ పద్ధతులు, కస్టమ్ డిజైన్ సామర్థ్యాలను ఉపయోగించుకుంటుంది.