Thursday, December 12, 2024

రాష్ట్రంలో వేదిక్ వర్శిటీ?

- Advertisement -
- Advertisement -

 ప్రణాళికలు రూపొందించాలని దేవాదాయశాఖకు
ప్రభుత్వం ఆదేశం కాళేశ్వరం, వేములవాడ, బాసర,
ధర్మపురిలలో ఏదో ఒక చోట నెలకొల్పే అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వేదిక్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రణాళికలు రూపొందించాలని దేవాదాయ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే దేవాదాయ శాఖ ఫీఠాధిపతుల అభిప్రాయాలు, వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని నిర్ణయించింది. విద్యార్థులకు వేదాలను బోధించడమే కాకుండా వేద విజ్ఞానాన్ని నూతన మార్గంలో ప్రపంచానికి అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. అందులో భాగంగా వేదిక్ యూనివర్శిటీని త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2006 సంవత్సరంలో టిటిడి నిధులతో ఎస్వీ యూనివర్శిటీ ప్రాంగణంలో శ్రీవేంకటేశ్వర వేద యూనివర్శిటీని సుమారు 50 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. అది విభజనలో భాగంగా ఎపి ప్రభుత్వానికి వెళ్లింది.

వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల గురించి
ప్రస్తుతం తెలంగాణలోనూ వేదిక్ యూనివర్శిటీని నిర్మించి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల గురించి భావితరాలకు తెలియచేయాలని, దీంతోపాటు వేద పండితులను ఈ యూనివర్శిటీ ద్వారా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ యూనివర్శిటీ నిర్మాణం కోసం అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని, కావాల్సిన వసతులు, అవసరమైన నిధులకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం దేవాదాయ శాఖను ఆదేశించినట్టుగా సమాచారం. వేద విద్య, వేద విజ్ఞానం ఆధునిక సమాజానికి అత్యవసరమని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. జన్మ, మృత్యు రహస్యాలు, మానవ శరీరాన్ని నడిపించే శక్తికి సంబంధించిన విజ్ఞానంతో పాటు తాళపత్ర గ్రంథాల్లో ఉండే లిఫీ గురించి కూడా పరిశోధించేలా ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిసింది. వేద విద్యతో పాటు, వైదిక అంశాలను కూడా ప్రపంచానికి తెలియజేసేలా దీని నిర్మాణం జరగాలని సిఎం భావిస్తున్నట్టుగా సమాచారం.

కాళేశ్వరం, బాసర, వేములవాడ, ధర్మపురిలో….
ఈ యూనివర్శిటీని రాష్ట్రంలోని కాళేశ్వరం, బాసర, వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయం, ధర్మపురిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఈ ప్రదేశాల్లో యూనివర్శిటీ ఏర్పాటుకు కావాల్సిన స్థల సేకరణకు సంబంధించి ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్‌లు ప్రభుత్వం స్థలాల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించినట్టుగా తెలిసింది. విష్ణుమూర్తి లేదా శివుడి ఆలయాల పరిధిలోనే ఈ వేదిక్ యూనివర్శిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. అయితే మిగతా రాష్ట్రాల్లో వేదిక్ యూనివర్శిటీలను ఎక్కువగా విష్ణుమూర్తి ఆలయాల పరిధి సమీపంలోనే ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఏ జిల్లాల్లో విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఎంత అన్న దానిపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. అయితే, విష్ణుమూర్తి లేదా శివుడి ఆలయాల పరిధిలో ఎక్కడ నిర్మించనున్న విషయమై క్లారిటీ రానుందని అధికారులు పేర్కొంటున్నారు.

వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయం పరిధిలో
అయితే వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయం పరిధిలో సుమారుగా 20 నుంచి 30 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్కడి అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించినట్టుగా తెలిసింది. అయితే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన నియోజకవర్గం పరిధిలో ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించినట్టుగా తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News