నమ్మి అధికారం ఇస్తే
అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా?
చేతి గుర్తుకు ఓటేస్తే
చేతగాని సిఎంను
నెత్తిన రుద్దారు
మళ్లీ మేం రాగానే ఇందిర, రాజీవ్ సంస్థల పేర్లను
మారుస్తాం కాంగ్రెస్‌తల్లిని గాంధీ భవన్‌కు
పంపిస్తాం గ్యారంటీలకు దిక్కులేదు…
డిక్లరేషన్‌కు అడ్రస్ లేదు అన్నదాత నుంచి
ఆడబిడ్డల వరకు అందరికీ అరిగోసే కాంగ్రెస్
అగ్రనేత రాహుల్‌గాంధీకి కెటిఆర్ లేఖ
చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారు
నమ్మి అధికారమిస్తే ఆగం చేయడమే కాక అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆత్మగౌరవం, స్వయంపాలన నినాదాలతో సాధించుకున్న తెలంగాణలో విష సంస్కృతిని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ చేసిన ఈ నీచమైన, కుటిల చర్యలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలంగాణలో చెరగడం ఖాయమని గుర్తుంచుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లేఖ రాశారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ , ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చడంతో పాటు తెలంగాణ సచివాలయం ముందు ఏర్పాటుచేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీ పార్టీ కార్యాలయమైన గాంధీభవన్ కు సకల మర్యాదలతో సాగనంపుతామని నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా స్పష్టంచేస్తున్నానన్నారు. చేతనైతే హామీలు అమలుచేయాలని, లేదంటే తెలంగాణ ప్రజల ముందు లెంపలేసుకుని క్షమాపణలు కోరాలన్నారు.
అంతేకానీ మేము పదేళ్లలో పెంచిన రాష్ట్ర సంపదను దోచుకుని, ఘనమైన తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను చెరిపేస్తామంటే సహించేది లేదని, మళ్లీ తెలంగాణను దశాబ్దాల సంక్షోభంలోకి నెట్టివేసి చేతులు దులుపుకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని కెటిఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. సరిగ్గా ఏడాది క్రితం కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు తెలంగాణను ఆగం చేయడమే కాకుండా తెలంగాణ అస్థిత్వాన్ని కూడా దెబ్బతీస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు. చేతకాని, మతిలేని ముఖ్యమంత్రిని తెలంగాణ నెత్తిన రుద్ది మీరు చేతులు దులుపుకోవడంతో అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతివర్గం అరిగోస పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చేసిన డిక్లరేషన్ల పట్ల మీకే డెడికేషన్ లేదని అక్షరాలా రుజువైపోయిందని, మేనిఫెస్టోలో మీరిచ్చిన 420 హామీలు కాంగ్రెస్ చీటింగ్ చాప్టర్ లో భాగమేనని తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. గాలి మోటర్లో వచ్చి గాలిమాటలు చెప్పి ఏడాది పాటు పత్తా లేకుండా పోయిన మీకు, మీ పార్టీకి తెలంగాణ పట్ల రవ్వంత కూడా బాధ్యత లేదని తేలిపోయిందని విమర్శించారు. దేశానికే వెన్నుముక అయిన రైతన్నకు వెన్నుపోటు పొడిచిన దుర్మార్గపు పాలన మీదని, కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఏకకాలంలో రైతులందరికీ డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట నీటిమూటే అయ్యిందన్నారు.
భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 12,527 మాత్రమే..
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ వేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మీరిచ్చిన హామీ గంగలో కలిసిపోయింది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 12,527 మాత్రమే అన్నారు. అంటే తెలంగాణ యువతకు మీ కాంగ్రెస్ ప్రభు త్వం అక్షరాలా 1,87,473 ఉద్యోగాలు బాకీ ఉందనే విషయాన్ని తెలంగాణ యువత మరిచిపోలేదని, యువతకు ఇస్తామన్న 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఏమయ్యాయని తె లంగాణ సమాజం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోందన్నారు.
ప్రజాధనాన్ని లూటీచేశారు..
అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీచేసిన సర్కారుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ చీకటి చరిత్రను లిఖించిందన్నారు. సీఎం బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్ నుంచి మొదలుకుంటే 1100 కోట్ల పౌరసరఫరాల స్కామ్, మంత్రి పొంగులేటి కుమారిడికి అప్పజెప్పిన కొడంగల్ లిప్ట్ పనుల దాకా అడుగడుగునా వేల కోట్ల అవినీతే తాండవించిదన్నారు. ఇక మూసీ బ్యూటిఫికేషన్ పేరిట ఏకంగా లక్షన్నర కోట్లకు ముఖ్యమంత్రి రేవంత్ వేసిన స్కెచ్ ను చూసి యావత్ సమాజం నివ్వెరపోయిందని, గోదావరి జలాలను మూసీకి తరలించే అంచనాలను రూ. 1100 కోట్ల నుంచి రూ. 5500 కోట్లకు అమాంతం పెంచేయడం మీ దోపిడీకి పరాకాష్ట అని పేర్కొన్నారు.