భారతదేశంలో వృద్ధుల జనాభా అనూహ్యంగా పెరుగుతోంది. అరవై ఏళ్లు దాటిన వృద్ధుల జనాభా 2021 నాటికి మొత్తం జనాభాలో 10.1 శాతం ఉండగా, 2036 నాటికి 15 శాతానికి, 2050 నాటికి 20.8 శాతానికి పెరుగుతుందని ‘ఇండియా ఏజింగ్ రిపోర్టు 2023’ అంచనాగా వెల్లడించింది. అయితే వృద్ధులకు తగినట్టు నగరాలు, గ్రామాల్లో వాతావరణం ఉండడం లేదు. నీరు, గాలి అంతా కలుషితమై చాలా సమస్యలను తెచ్చిపెడుతోంది. స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని ప్రజలు 89 శాతం కాలుష్యాన్ని భరిస్తున్నారు. కాలుష్య పీడిత ప్రాంతాల్లో వృద్ధుల బతుకు నరకయాతన అవుతోంది. నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో వాయు కాలుష్యంతో ఏటా 4.2 మిలియన్ల అకాల మరణాలు సంభవిస్తున్నాయని 2019లో చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. హృదయ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్‌లకు కారణమయ్యే కాలుష్య సూక్ష్మకణాల బారిన పడడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని అధ్యయనాల్లో నిర్ధారణ అయింది.
60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో కాలుష్యం వల్ల వారి దైనందిన జీవన కార్యకలాపాలు సాగడం లేదని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు సగటున 15,411 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు బయటపడ్డాయి. అరవై ఏళ్లు పైబడిన వారిలో కనీసం 48 శాతం మంది కాలుష్యానికి గురి కావడం వల్ల రోజువారీ కార్యకలాపాలను నిర్వహించ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అధ్యయనంలో తేలింది. వాయు కాలుష్య ప్రభావాన్ని పరిశీలిస్తే పర్టిక్యులేట్ మ్యాటర్ (పిఎం2.5, మరియు పిఎం 102.5)తోపాటు నైట్రొజన్ డయాక్సైడ్ (ఎన్‌ఒ2) అధిక సాంద్రతలు వృద్ధుల దైనందిన కార్యకలాపాలకు తీవ్ర రిస్కు కలిగించేవిగా ప్రభావం చూపిస్తున్నాయి. వాయు కాలుష్యం వల్ల వచ్చే ఇబ్బందులను వృద్ధుల్లో చాలా మంది అంతగా పట్టించుకోవడం లేదు. పిఎం2.5, పిఎం 10, నైట్రొజన్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్య రేణువులను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో మంటపుట్టి ఆక్సీకరణ ఒత్తిడికి దారి తీస్తుందని నగరాల్లో డాక్టర్లు వెల్లడించారు.
శరీరం లోని కండరాలు నీరసపడి పోతాయని చెప్పారు. శ్వాసకోశ వ్యవస్థ మాత్రమే కాదు, శరీర వ్యవస్థ కూడా దెబ్బతింటుందని పేర్కొన్నారు. 65 ఏళ్లు కన్నా ఎక్కువ వయసు ఉన్న వారు అవయవ పనితీరులో, రోగ నిరోధక స్థితిస్థాపకతలో సహజమైన క్షీణతను అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ వయసు వారు గుండెజబ్బులు, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, మధుమేహం వంటి వ్యాధుల పీడితులై గడుపుతున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్వహించిన లాంగిట్యూడినల్ ఏజింగ్‌స్టడీ ఆఫ్ ఇండియా 2021 నివేదిక భారత దేశం లోని వృద్ధాప్య జనాభా ఎదుర్కొంటున్న పరిస్థితులు బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం 75 శాతం మంది వృద్ధులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు.. ఇంకా 24 శాతం మంది డైలీ లివింగ్ కార్యకలాపాల్లో (ఎడిఎల్ ) కనీసం ఒక పరిమితిని కలిగి ఉన్నారు. 48 శాతం మందికి తమ దైనందిన వ్యవహారాల్లో ఎవరో ఒకరి సహాయం కావలసి వస్తోంది. కుటుంబాల ఆసరా లేక ప్రతి ముగ్గురిలో ఒకరు కుంగుబాటుకు గురవుతున్నారు. 32 శాతం మంది అసంతృప్తి జీవితాన్ని గడుపుతున్నారు.
సామాజిక రక్షణకు సంబంధించి 18 శాతం మంది వృద్ధులకు మాత్రమే ఆరోగ్య బీమా ఉంటోంది, 28 శాతం మంది వృద్ధులకు రాయితీల గురించి తెలిసినా, 70 శాతం మంది వృద్ధులు రోజువారీ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడుతున్నారు. 78 శాతం మంది ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేకుండా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వృద్ధుల సంరక్షణ సేవలు అందించే ఎల్డర్ కేర్ స్టార్టప్ ( అంకుర పరిశ్రమ)లు తెరమీదికి వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ఎదురైన తరువాత వృద్ధుల సంరక్షణ ఆయా కుటుంబాలకు ఒక సమస్యగా తయారైంది. అందువల్ల వృద్ధుల సంరక్షణ కేంద్రాలను ఆశ్రయించడం తప్పనిసరి అవుతోంది. ఈ సంరక్షణ కేంద్రాలన్నీ కేవలం సేవా సంస్థల్లా కాకుండా ఎంతో కొంత నగదు చెల్లింపుల ఆధారంగా పనిచేస్తుంటాయి. అయితే పేదలైన వృద్ధులకు ఈ ఎల్డర్ కేర్ స్టార్టప్‌ల నుంచి సాయం పొందడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి ఒక విధంగా వాణిజ్యపరమైన సంస్థలు అయినందున ప్రతినెలా వారు ఛార్జీ చేసిన మేరకు డబ్బు వెచ్చించ వలసి వస్తుంది. ఆర్థికంగా స్థితిమంతులైన కుటుంబాలలో వృద్ధులను సంరక్షించడానికి ప్రయివేట్ రంగంలో అనేక స్టార్టప్(అంకుర పరిశ్రమ)లు ఉన్నాయి.
పేషెంట్ కేర్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌వరకు సకల సౌకర్యాలు సమర్ధవంతంగా ఇవి అందజేయగలుగుతాయి.వైద్యులు, నర్సులు అందుబాటులో ఉండి వృద్ధుల ఆరోగ్యభద్రతను నిర్వహిస్తుంటారు. పాశ్చాత్య దేశాల్లో ఒంటరి వారైన వృద్ధులకు ఈ స్టార్టప్ కేర్ సెంటర్ల ద్వారా సంరక్షణ అందించాలంటే నెలకు రూ.90,000 వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. అలాగే వృద్ధులైన తల్లిదండ్రులకు సంరక్షణ కోసం నెలకు రూ.2 లక్షల వరకు భరించవలసి వస్తుంది. రానున్న 30 ఏళ్ల లో ఈ ఖర్చు అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. మనదేశంలో వృద్ధుల సంరక్షణ కేంద్రాలు సేవా దృక్పథంతో నామమాత్రంగా నెలకు రూ.15,000 నుంచి 25,000 వరకు ఛార్జి చేస్తున్నాయి. అయినా ఆమేరకు కూడా చెల్లించలేని నిరుపేద వృద్ధులు దేశంలో చాలా మంది ఉన్నారు. సగటు భారతీయులకు ఈ సేవల ఖర్చు తగ్గించాలనుకోవడం ఒక సవాలే. వృద్ధుల సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురాడానికి ఆర్థిక అడ్డంకులను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా వయోవృద్ధుల సంరక్షణకు, ఆరోగ్య భద్రతకు తగిన ప్రణాళికలు అమలు చేయడం తప్పనిసరి అని సామాజిక సేవా సంస్థలు సూచిస్తున్నాయి.
డా. బి. రామకృష్ణ 99599 32323